 
                                    
- రూ.450 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ
- ప్రతిపాదిత స్థలాల లేఅవుట్లకు ఆదేశాలు
- ఉద్యోగులకు 860, ఆఫీసర్లకు 40 కొత్త క్వార్టర్ల నిర్మాణం
కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి ఉద్యోగులు, ఆఫీసర్లు ఉండేందుకు కొత్తగా 1000 క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకోగా, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రూ.450 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.313.32 కోట్ల అంచనాతో కొత్త క్వార్టర్ల నిర్మాణాలు ప్రారంభంకానున్నాయి.
డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇండ్లు (క్వార్టర్లు) తరహాలో జీ+1 విధానంలో ఆఫీసర్లకు మిలీనియం ఏ, బీ, పద్ధతిలో, సూపర్వైజర్ క్యాడర్, వర్క్మెన్ల కోసం మిలీనియం సీ, డీ బ్లాక్ పద్ధతిలో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి బ్లాక్లో నివసించే వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. జూన్లో డైరెక్టర్ల బోర్డు అప్రూవల్ ఇవ్వగా, తాజాగా ఫండ్స్ మంజూరు చేసింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో రూ.193 కోట్లతో 449 క్వార్టర్లు, పెద్దపల్లి జిల్లా రామగుండం-1 ఏరియా (గోదావరిఖని)లో రూ.133 కోట్లతో 318 క్వార్టర్లను, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.45 కోట్లతో 79 క్వార్టర్లు, ఖమ్మం జిల్లా మణుగూరు ఏరియాలో రూ.79 కోట్లతో 154 కొత్త క్వార్టర్లను నిర్మించనున్నారు.
ఇందులో ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల కోసం 860 క్వార్టర్లు, ఆఫీసర్ల కోసం 140 క్వార్టర్లను నిర్మిస్తారు. కొత్తగా క్వార్టర్లు నిర్మించే ప్రతిపాదిత స్థలాల లేఆవుట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత ఆఫీసర్లను సింగరేణి కార్పొరేట్ యాజమాన్యం ఆదేశించింది.

 
         
                     
                     
                    