భారీ వర్షాలు, ఈదురుగాలుల ఎఫెక్ట్ .. అంధకారంలో 10 గ్రామాలు

భారీ వర్షాలు, ఈదురుగాలుల ఎఫెక్ట్ .. అంధకారంలో 10 గ్రామాలు
  • పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎండీ, డైరెక్టర్
  • రెండో రోజు తగ్గని వరద ఉధృతి

వెలుగు, నెట్​వర్క్: మొంథా తుఫాన్​ ప్రభావంతో నాగర్ కర్నూల్,​ నల్గొండ జిల్లాల పరిధిలోని 10 గ్రామాలు చీకట్లోనే మగ్గుతుండగా, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. విద్యుత్​ శాఖ సీఎండీ ముషారఫ్​ అలీ ఫారూఖీ, ప్రాజెక్టు డైరెక్టర్  వి శివాజీ పరిశీలించి పలు సూచనలు చేశారు. నాగర్​కర్నూల్​లో డైరెక్టర్​ శివాజీ వివరాలు వెల్లడించారు. తుఫాన్​ ప్రభావంతో 456 స్తంభాలు, 29 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని, దీంతో నాగర్ కర్నూల్  జిల్లా దిండి వాగు పరిధిలోని అకారం, బక్క లింగాయపల్లి, ఘనపూర్ తో పాటు మరో మూడు తండాల్లో, నల్గొండ జిల్లాకు చెందిన కంచలపల్లి, పొగిలి, రేకుల గడ్డ గ్రామాల్లో విద్యుత్  సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. 

భారీ వరదలతో విద్యుత్  శాఖకు భారీ నష్టం వాటిల్లిందని, ఒక్క నల్గొండ జిల్లాలోనే 197 పోల్స్, 8,211 కేవీ పోల్స్, 23 డిస్ట్రిబ్యూషన్  ట్రాన్స్ ఫార్మర్లు వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. నాగర్ కర్నూల్ లో 105 పోల్స్, సూర్యాపేటలో 42 పోల్స్ దెబ్బతిన్నాయన్నారు. కంబాలపల్లి, అక్కారం, తెల్దారుపల్లి, చెరుకుపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్లకు సంబందించిన 33 కేవీ ఫీడర్లు దెబ్బతినడంతో సరఫరాలో అంతరాయం కలిగిందని చెప్పారు.

సరళాసాగర్  ప్రాజెక్టులోకి గురువారం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రెండు ప్రైమరీ, రెండు వుడ్  సైఫన్లు తెరచుకుని 8 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్తోంది. కొత్తకోట మండలం కానాయపల్లి శంకర్  సముద్రానికి భారీగా వరద నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. మదనాపురం రైల్వే గేట్  సమీపంలో లో లెవెల్ వంతెనపై భారీగా వరద నీరు పారుతోంది. కొత్తకోట– ఆత్మకూరు మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రామన్ పాడు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి 10 వేల క్యూసెక్కులు కిందికి వదిలారు.

 డిండి అలుగు ఉధృతికి తెగిన మైనర్  బ్రిడ్జికి హైవే అథారిటీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. హైదరాబాద్, అచ్చంపేట, శ్రీశైలం, దేవరకొండ వెళ్లే వాహనాలను కొండారెడ్డి, పోల్కంపల్లి నుంచి డిండి, చింతపల్లి మీదుగా మళ్లించారు.

కల్వకుర్తి నియోజకవర్గం లో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కల్వకుర్తి మండలం వెంకటాపూర్  గ్రామం వద్ద కేఎల్ఐ కాల్వ ఓవర్ ఫ్లో కావడంతో కాల్వకట్ట ఎత్తు పెంచాలని అధికారులను ఆదేశించారు