
గరుడవేగ, కల్కి వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో మెప్పించాక.. అంతకంటే వెరైటీ కాన్సెప్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు రాజశేఖర్. మలయాళ సూపర్‌హిట్ ‘జోసెఫ్’ తెలుగు రీమేక్ ‘శేఖర్’లో నటిస్తున్నారు. జీవిత దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. నిన్న రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘కిన్నెర ఓ కిన్నెర’ అనే పాటను విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ ట్యూన్‌కి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. అర్మాన్ మాలిక్ పాడాడు. రాజశేఖర్, హీరోయిన్ ముస్కాన్ ఖూబ్‌చందానీలపై ఈ పాటను తీశారు. పది సినిమాలకి పడిన కష్టం ఈ సినిమాకి పడ్డానని, ఆ ఫలితం సినిమాలో కనిపిస్తుందని రాజశేఖర్ అన్నారు. సినిమా పూర్తయ్యిందని, త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని జీవిత చెప్పారు. నాన్న హీరోగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర చేయడం ఆనందంగా ఉందని శివాని చెప్పింది.