జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదాం : పెద్దింటి రామకృష్ణ

జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదాం : పెద్దింటి రామకృష్ణ
  • జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాడుదాం.. 
  • ఇయ్యాల జార్జిరెడ్డి వర్ధంతి

జీనా హైతో మర్నా సీఖో– కదం కదం పర్ లడ్నా  సీఖో” ఈ నినాదం నాటి నుంచి నేటి వరకు విద్యార్థి, యువజన, ప్రజా పోరాటాల్లో రణనినాదమైంది. జార్జిరెడ్డి పేరు యాదికి వచ్చినప్పుడల్లా వెయ్యి ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్నట్టు, దేన్నైనా సాధించగలమనే మనోధైర్యం పొందినట్టనిపిస్తుంది. ధైర్యంగా, దృఢంగా ఎంత మందినైనా ఎదుర్కోగల మేధాశక్తి, శారీరక శక్తి గలవాడు జార్జి రెడ్డి. 1947 జనవరి15న కేరళ రాష్ట్రంలో లీల రఘునాథరెడ్డి దంపతులకు నాలుగో సంతానంగా జార్జిరెడ్డి జన్మించాడు. మద్రాస్​లో పెరిగి తెలుగు నేలపై హైస్కూల్ విద్య పూర్తి చేసి డాక్టర్ కావాలనే సంకల్పంతో1963లో నిజాం కాలేజీ పీయూసీలో చేరాడు. ఆ తర్వాత యూనివర్సిటీ స్థాయిలో రెండో ర్యాంకు వచ్చిన మెడిసిన్ సీటు రాలేదు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో సైన్స్ కాలేజీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీలో చేరాడు. ఓయూలో చేరిన జార్జిరెడ్డి జీవితం ఓ సరికొత్త మలుపు తిరిగింది. ఉన్నత చదువుల కోసం నిజాం కాలేజీ ఉస్మానియా యూనివర్సిటీకి మెజార్టీగా భూస్వామ్య, అగ్రవర్ణాలకు సంబంధించిన వారి పిల్లలు వచ్చేవారు. స్కాలర్షిప్ మీద మాత్రమే ఆధారపడి చదివే వారు పేద, బడుగు, బలహీన వర్గాల సంబంధించిన వారి పిల్లలు స్కాలర్షిప్స్ రాకపోతే చాలా ఇబ్బందులకు గురయ్యే వారి బాధలను జార్జ్ అర్థం చేసుకున్నాడు. వారి సమస్యకు పరిష్కారం స్కాలర్షిప్స్ రావడమే అని స్కాలర్షిప్స్ సాధన కోసం పీడీఎస్ విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాట మొదలు పెట్టారు. అప్పటికే సామ్రాజ్యవాద అమెరికాతో చేగువేరా పోరాటం చేయడం ఆ పోరాటాన్ని తట్టుకోలేని అమెరికా కుట్రపూరితంగా చేగువేరను హత్య చేయడం ఆ హత్య ప్రభావం, చేగువేరా పోరాట భావాలు ప్రపంచమంతా వ్యాపించడంతో జార్జి రెడ్డిపై కూడా ఆ ప్రభావం పడింది. 

ప్రగతిశీల భావాలు

జార్జిరెడ్డి నిత్య అధ్యయనశీలి. యూనివర్సిటీ లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. జార్జిరెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్​లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన మేధస్సుకు సమాజంలో ఉన్నత ఉద్యోగం దొరికేది. అలాంటి ఉద్యోగ అవకాశాలు ఎన్నో తన దగ్గరికి వచ్చినా నిరాకరించాడు. సమాజంలో వర్గ దోపిడీని అంతమొందించాలనుకున్నాడు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సమానత్వాన్ని కాంక్షించాడు. కులం, మతం లేని వ్యవస్థను కోరుకున్నాడు. శాస్త్రీయ విధానాలు అమలు కావాలని ఆశించాడు. అది కొంత మందికి నచ్చలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని మతోన్మాద మూకలు చేసే అరాచకాలతో స్టూడెంట్స్ నిత్యం అనేక ఇబ్బందులు పడేవారు. వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని జార్జి బృందం చర్చ చేసేవారు. ఫ్యూడల్ సంస్కృతి విలయతాండవం చేస్తూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థినీ, విద్యార్థులపై, అధ్యాపకులపై, ప్రొఫెసర్లపై, ప్యూడలిజం రెక్కలు విప్పి బుసకొడుతున్న సమయం. చేగువేరా నుంచి స్ఫూర్తి పొందిన జార్జ్ యూనివర్సిటీలో జరిగే అన్యాయాలను, అక్రమాలను వ్యతిరేకిస్తూ ఆలోచన పరిపక్వతతో విద్యార్థులకు అండగా, విద్యార్థి నాయకుడిగా, తారాజువ్వలా ముందుకొచ్చాడు. ప్రగతిశీల భావాలను, వాస్తవ విషయాలను విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో విస్తృతంగా వెదజల్లాడు. దీంతో వర్సిటీలో క్రమంగా మతోన్మాద, ప్యూడల్ శక్తుల బలం తగ్గడం ప్రారంభమైంది. జార్జిరెడ్డిని భౌతికంగా లేకుండా చేస్తే తప్ప తమ ఉనికి ఉండదని భావించారు. 1972 ఏప్రిల్ 14న ఇంజనీరింగ్ కళాశాల కిన్నెర హాస్టల్ వద్ద నిరాయుధుడైన జార్జిరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపారు. ఆయన తర్వాత చాలా మంది విద్యార్థి నాయకులను దుండగులు హత్య చేశారు. అయినా పోరాట స్ఫూర్తి ఎన్నడూ ఆగలేదు. పాలక వర్గాలు అనుసరిస్తున్న విద్యార్థి, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై తన శక్తి మేరకు ప్రగతిశీల విద్యార్థి సంఘం నేటికీ పోరాడుతూనే ఉన్నది. సమ సమాజ స్థాపన కోసం జార్జిరెడ్డి స్ఫూర్తితో పోరాటాలు కొనసాగిద్దాం. 

- పెద్దింటి రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, పీడీఎస్​యూ