మసీదులో హనుమాన్ చాలీసా పఠనం.. నలుగురి అరెస్ట్

మసీదులో హనుమాన్ చాలీసా పఠనం.. నలుగురి అరెస్ట్

మధుర: ఉత్తర్ ప్రదేశ్, మధుర, గోవర్దన్‌‌లోని ఒక మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేసినందుకు నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నలుగురిలో ఒకరిని యూత్ వింగ్‌‌కు చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న నలుగురు యువకులు గోవర్దన్-బర్సానా రోడ్‌‌లోని ఈద్గాలో ప్రవేశించారు. వీరిని సౌరభ్ నంబర్దార్, రాఘవ్ మిట్టల్, రౌకీ, కన్హాలుగా గుర్తించారు.

మధుర, బర్సానా టౌన్‌లోని నంద్ బబా ఆలయంలో మంగళవారం ఉదయం కొందరు ముస్లిం యువకులు ప్రవేశించారు. ఆలయంలో సదరు ముస్లిం యువకులు నమాజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హిందూ యువకులు మసీదులో హనుమాన్ చాలీసాను పఠించడం గమనార్హం. ఈ రెండు ఘటనలపై పోలీసులు స్పందించారు. ఎవరైనా మతపరమైన ఉద్రిక్తతలు, గందరగోళాన్ని సృష్టించడానికి యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మధుర ఎస్పీ గౌరవ్ గ్రోవర్ చెప్పారు.