నేపాల్‎లో ముగిసింది.. ఫిలిప్పీన్స్‎లో మొదలైంది: ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత

నేపాల్‎లో ముగిసింది.. ఫిలిప్పీన్స్‎లో మొదలైంది: ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత

మనీలా: దేశంలో సోషల్ మీడియాపై బ్యాన్, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‎లో జెన్ జెడ్ యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. యువత ఆక్రోషం కట్టలు తెంచుకోవడంతో నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. జెన్ జెడ్ యువత నిరసనల దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది.

 సుశీలా కర్కీ నేతృత్వంలో నేపాల్‎లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతో నేపాల్‎లో పరిస్థితులు సద్దుమణిగాయి. నేపాల్‎లో అల్లర్లు చల్లారి వారం గడిసిందో లేదో మరో దేశంలో ఇదే తరహా ఆందోళన మొదలైంది. ఫిలిప్పీన్స్‎లో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆ దేశ యువత కదం తొక్కారు. ఆదివారం (సెప్టెంబర్ 21) వేలాది మంది నిరసనకారులు ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలా వీధుల్లోకి వచ్చి వరద నియంత్రణ అవినీతి కుంభకోణంపై ఆందోళన తెలిపారు.

 వరద నియంత్రణ ప్రాజెక్టుల్లో భారీ కుంభకోణం జరిగిందని.. శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడంతో మనీలాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిరసనకారులను అదుపు చేయడం పోలీసులకు సవాల్‎గా మారింది.

 నిరసనలు దేశమంతటా వ్యాపించకుండా ముఖ్యమైన నగరాల్లో భారీగా భద్రతను పెంచారు. నేపాల్ తరహా పరిస్థితులు తలెత్తకుండా రాజకీయ నేతల ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ లో ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేసిన సరిగ్గా 10 రోజులు గడవకముందే.. ఫిలిప్పీన్స్‎లో ఇదే తరహా ఆందోళనలు  చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. 

ఫిలిప్పీన్స్‎లో అల్లర్ల నేపథ్యంలో అప్రమత్తమై అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఫిలిప్పీన్స్‎లో ఉంటున్న తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. నిరసన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించాయి. ఏదైనా సమస్య తలెత్తితో ఎంబసీ కార్యాలయాలను సంప్రదించాలని సూచనలు చేశాయి.