
- ఏపీ బాకీలు కట్టాలంటూ తెలంగాణకు కేంద్రం ఆదేశం
- మరో వారం రోజుల్లో తీరనున్న గడువు
- 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మీటింగ్
- కరెంట్ బాకీలపై నివేదికను సిద్ధం చేస్తున్న రాష్ట్ర సర్కార్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లయినా కరెంటు బాకీల పంచాదీ ఎటూతేల్తలేదు. విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య దాదాపు పరిష్కారం కాగా కరెంట్ బాకీల పంచాదే ఎటూ తేలడంలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ కు 30 రోజుల్లోగా కరెంటు బాకీలు చెల్లించాలంటూ ఆగస్టు 29న కేంద్ర విద్యుత్ శాఖ డిప్యూటీ సెక్రటరీ అనూప్‌సింగ్ బిస్త్ ఆదేశాలు జారీ చేశారు. విభజన చట్టం సెక్షన్ 92 ప్రకారం ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కంలు బాకీలు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చారు. కేంద్రం ఆదేశాలకు మరో వారం రోజులే గడువు ఉండడం, 27న ఢిల్లీలో మీటింగ్ ఉండడంతో రెండు రాష్ట్రాల కరెంటు వివాదం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.
కరెంట్ బాకీల విషయం మళ్లీ తెరపైకి రావడంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు తమకు ఏపీ డిస్కంల నుంచి రావాల్సిన బాకీలపై నివేదికను సిద్ధం చేస్తున్నాయి. 27న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే మీటింగ్ లో రెండు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ కానున్నారు. ఈ భేటీలో విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. బాకీల వ్యవహారంపై గట్టిగా బదులివ్వాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. కేంద్రం ఆదేశాలపై అభ్యంతరాలతో కూడిన నివేదికను రెడీ చేస్తోంది. రెండు రాష్ట్రాల కరెంటు బాకీలపై నివేదికను ఈ భేటీలో కేంద్రానికి అందించాలని నిర్ణయించింది. విద్యుత్ సంస్థల వివాదంతో పాటు సింగరేణీకి సంబంధించిన విజయవాడలోని హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వివాదాన్ని కూడా తెరపైకి తేవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది.
ఆందోళనలో రాష్ట్ర డిస్కంలు
కరెంటు పంచాయితీ ఒక కొలిక్కి రాక పోతే ఇబ్బందేనని డిస్కంల అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కోసం కొంటున్న కరెంటుకే అప్పులు తెచ్చి కడుతూ అవస్థలు పడుతున్న డిస్కంలకు తాజా వ్యవహారం గుదిబండగా మారింది. దీన్ని బేస్ చేసుకుని మళ్లీ నేషనల్ ఎక్చేంజీ నుంచి కరెంటు కొనుగోళ్లను అడ్డుకుంటే పరిస్థితి ఏందని డిస్కంలు బెంబేలెత్తుతున్నాయి. తాజాగా కేంద్రం ఇచ్చిన గడు వు మరో వారంలో ముగియనుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తెస్తే వేల కోట్లు ఎక్కడి నుంచి తేవాలని డిస్కంల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి.
ఏపీ బకాయిలు రూ.17,828 కోట్లు
ఏపీకి చెందిన అనంతపురం, కర్నూల్ జిల్లాలకు కరెంటు సరఫరా చేసిన కరెంట్ కు సంబంధించి తెలంగాణ డిస్కంలకు రూ.2,036 కోట్లు, వడ్డీ రూ.939 కోట్లు కలిపి మొత్తం రూ.2,975 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇతర ఇంటర్ స్టేట్‌కు సంబంధించి అన్నీ కలిపి ఏపీ డిస్కంలు మరో రూ.2,569 కోట్లు తెలంగాణకు బాకీ పడ్డాయి. ఇలా డిసెంబర్ 31, 2021 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్ కో రూ.11,248 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి10.50 శాతం చొప్పున రూ.6,579 కోట్లు వడ్డీ అయింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.17,828 కోట్లు బాకీ ఉందని తెలంగాణ సర్కారు పేర్కొంటోంది. ఇందులో నుంచి ఏపీకి చెల్లించాల్సిన బాకీలు తీసేస్తే ఏపీ విద్యుత్ సంస్థలే డిసెంబర్ 2021 నాటికే తెలంగాణకు రూ.12,940 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తోంది.
తెలంగాణ బాకీలు రూ. 6,756 కోట్లు
ఏపీకి తెలంగాణ డిస్కంలు రూ.6,756.92 కోట్లు బాకీ పడ్డాయి. రాష్ట్ర విభజన తరువాత జూన్ 2, 2014 నుంచి అక్టోబరు 6, 2017 వరకు ఏపీ జెన్ కో నుంచి తెలంగాణ డిస్కంలు కరెంటు కొన్నాయి. దానికి సంబంధించి కరెంటు బాకీలు రూ.3,441.78 కోట్లు కట్టాల్సి ఉంది. అలాగే అప్పటి నుంచి జులై 31, 2022 వరకు లేట్ పేమెంట్ సర్ చార్జీల రూపంలో మరో రూ.3,315.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇలా రెండూ కలిపి మొత్తం రూ.6,756.92 కోట్ల మేరకు తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది.