బ్యాంకులో పైసలు ఇస్తామనడంతో..తల్లి శవానికి అంత్యక్రియలు

బ్యాంకులో పైసలు ఇస్తామనడంతో..తల్లి శవానికి అంత్యక్రియలు

బ్యాంకులో పైసలు ఇస్తామనడంతో..తల్లి శవానికి అంత్యక్రియలు

మూడు రోజులుగా మార్చురీలో ఉన్న కిష్టవ్వ డెడ్​బాడీకి విముక్తి

కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో చికిత్స పొందుతూ చనిపోయిన తల్లి శవాన్ని మూడు రోజుల తర్వాత  బిడ్డలు తీసుకెళ్లారు. బ్యాంక్​లో తల్లి, చనిపోయిన మరో బిడ్డ పేరిట ఉన్న  పైసలను వచ్చేలా చూస్తామని, నామినీగా ఉన్న  బంధువుకు కాకుండా చేస్తామని చెప్పడంతో ఎట్టకేలకు శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్​బీనగర్​కు చెందిన కడమంచి కిష్టవ్వ (70) అనారోగ్యంతో బాధపడుతూ  ఏప్రిల్​ 21న కామారెడ్డి జిల్లా హాస్పిటల్​లో చేరింది.

పరిస్థితి విషమించడంతో ఈ నెల 6న రాత్రి చనిపోయింది. ఈమెకు పెంటవ్వ, ఎల్లవ్వ, చంద్రవ్వతో పాటు మరో కొడుకు ఉన్నాడు. కొన్నేండ్ల  క్రితం కొడుకు, ఇటీవల చంద్రవ్వ చనిపోయారు. కిష్టవ్వతో పాటు, ఆమె రెండో  బిడ్డ చంద్రవ్వ పేరిట బ్యాంకులో   రూ.లక్షా  70వేల వరకు ఉన్నాయి. బ్యాంక్​లో నామినీగా కిష్టవ్వ మరదలు రోజా పేరు రాయించింది. తల్లి హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న టైంలో పెంటవ్వ, ఎల్లవ్వలు రెండుసార్లు వచ్చి వచ్చి బ్యాంకులో ఉన్న పైసల గురించి అడిగి వెళ్లిపోయారు.

ఈనెల 6న రాత్రి కిష్టవ్వ చనిపోగానే  బిడ్డలకు హాస్పిటల్ ​సిబ్బంది సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా మాట్లాడారు. బ్యాంక్​లో తల్లి పేరిట ఉన్న పైసలు తమకు ఇస్తేనే హాస్పిటల్​కు వచ్చి శవాన్ని తీసుకెళ్తామని మొండికేశారు.  దీంతో మూడు రోజులుగా శవం హాస్పిటల్​లోని మార్చురీలోనే ఉంది. ఈ ఘటనపై సోమవారం మీడియాలో వార్తలు రావడంతో సోమవారం మరోసారి పెంటవ్వ, ఎల్లవ్వలతో పోలీసులు చర్చించారు. నామినీగా ఉన్న రోజాను కూడా పిలిపించి మాట్లాడారు. అంత్యక్రియలు చేసిన తర్వాత పైసలు ఇప్పిస్తామని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. తర్వాత శవాన్ని అంబులెన్స్​లో నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి  అంత్యక్రియలు చేశారు.