కిలో ఉల్లిపాయలు 70 రూపాయలు.. సెప్టెంబర్ అలర్ట్..

కిలో ఉల్లిపాయలు 70 రూపాయలు.. సెప్టెంబర్ అలర్ట్..

గత కొన్ని రోజులుగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తుండగా.. ఇప్పుడు మరో కూరగాయ నేనున్నానంటూ వచ్చి చేరనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే టమాటా ధరలు కిలోకు రూ. 250కి చేరుకోగా. ఇప్పుడు ఉల్లి ధరల వంతు రాబోతోంది. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్‌లో ఈ ధరల పెరుగుదల ప్రారంభయ్యే అవకాశం ఉందని క్రిసిల్ ఇటీవలే ఓ నివేదికలో తెలిపింది. వచ్చే నెలలో(సెప్టెంబర్) ఉల్లిపాయల ధరలు రూ.60 నుంచి 70 రూపాయల వరకు పెరగవచ్చని అంచనా వేసింది. అయితే ఈ ధరలు 2020 గరిష్ట స్థాయి కంటే తక్కువగానే ఉంటాయని తెలిపింది.

“సరఫరా-డిమాండ్ అసమతుల్యత అనేది ఆగస్టు చివరి నాటికి అది ఉల్లి ధరలలో ప్రతిబింబిస్తుంది. రిటైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ ప్రారంభం నుంచి ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా. లీన్ ప్యాచ్ సమయంలో కిలోకు రూ. 60-70 వరకు చేరుకుంటుంది. అయితే ఈ ధరలు 2020 గరిష్ట స్థాయి కంటే తక్కువగానే ఉంటాయి" అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ నివేదిక చెప్పింది. అయితే, రబీ ఉల్లిపాయల సెల్ఫ్ లైఫ్ తగ్గడం, ఫిబ్రవరి-మార్చిలో అమ్మకాల భయాందోళనల కారణంగా, సప్లై-డిమాండ్‌లో అసమతుల్యత వచ్చింది. ఈ ప్రభావంతో ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరల్లో పెరుగుదల ప్రారంభం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది.

అక్టోబరు నుంచి ఖరీఫ్ రాక ప్రారంభం కాగానే ఉల్లి సరఫరా తగ్గుతుందని, ధరలు తగ్గుముఖం పడతాయని కూడా నివేదిక వెల్లడించింది. పండుగ నెలల్లో (అక్టోబర్-డిసెంబర్) ధరల కదలిక స్థిరంగా ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది జనవరి-మే మధ్య కాలంలో, ఉల్లి ధరల తగ్గుదల, తృణధాన్యాలు, పప్పులు, ఇతర కూరగాయలను కొనుగోలు చేసే వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే, ఇది ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి రైతుల్లో ప్రతికూలతలను సృష్టించింది.

“ఫలితంగా, ఈ సంవత్సరం విస్తీర్ణం 8 శాతం తగ్గుతుందని, ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి సంవత్సరానికి 5 శాతం తగ్గుతుందని మేము భావిస్తున్నాం. వార్షిక ఉత్పత్తి 29 మిలియన్ టన్నులు (MMT) ఉంటుందని అంచనా. గత ఐదేళ్ల సగటు (2018-2022) 7శాతం కంటే ఎక్కువ" అని నివేదిక తెలిపింది. కాబట్టి, ఖరీఫ్, రబీలో ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం సరఫరాలో సంక్షోభం ఏర్పడే అవకాశం లేదు. అయితే, ఆగస్టు, సెప్టెంబర్‌లలో కురిసే వర్షపాతం ఉల్లి పంట ప్లాంటేషన్, అభివృద్ధిని నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.