కరోనా కాలంలో ముసలోళ్ల గోస

కరోనా కాలంలో ముసలోళ్ల గోస
  • కొడుకులు, కోడళ్ల వేధింపులు, సూటిపోటి మాటలు
  • తమను వేధించారని చెప్పిన 73 శాతం మంది
  • కొడుకులు కొట్టారన్న 48 శాతం మంది
  • మెట్రో సిటీల్లో ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ చేసిన సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: కరోనా కష్టకాలంలో వృద్ధులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ముసలి వాళ్లకు లాక్‌డౌన్‌లు కన్నీటి బాధ మిగిల్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్‌డౌన్‌ కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 73 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు వివిధ మెట్రో నగరాలల్లో ఏజ్‌ వెల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముసలివాళ్లయిన తల్లిదండ్రులను కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇంట్లో ఉన్న వృద్ధులను భారంగా భావిస్తూ వేధిస్తున్నారని సర్వేలో తెలిసింది. మనసును గాయపెట్టే మాటలతో పాటు దాడి చేస్తున్నారని వెల్లడైంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లో ఈ ఏడాది జూన్‌ 2నుంచి12 వరకు ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ సర్వే చేసింది. సుమారు5 వేల మంది వృద్ధులను కలిసి వివరాలు సేకరించింది. వాళ్ల జీవితాల్లో కరోనా మానసిక భయాందోళనను తీసుకొచ్చిందని సర్వే గుర్తించింది. కుటుంబీకులను, తెలిసినవాళ్లను కోల్పోవడం, కుటుంబీకుల ఉపాధి పోవడం లాంటి సమస్యలతో ముసలివాళ్లు తీవ్ర ఆందోళన చెందారని సర్వే తేల్చింది. మానసిక ఒత్తిడి, ఆందోళన, వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురి కావడం, ఒంటరితనం,  నిద్రలేమితో వాళ్లు బాధ పడుతున్నట్లు తెలుసుకుంది.

ఏ బాధ లేదన్నోళ్లు 10 శాతం మంది
తమ జీవితం లాక్‌డౌన్‌ కాలంలో బాగా ప్రభావితమైందని 82 శాతం మంది వృద్ధులు చెప్పారు. తమపై వేధింపులు పెరిగాయని 73 శాతం మంది అన్నారు. జీవితంలో ఎప్పుడూ చూడని వివక్షను ఎదుర్కొన్నామని 65 శాతం మంది తెలిపారు. 58 శాతం మంది తమను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, దాడులు చేస్తున్నారని చెప్పారు. కొడుకులు దాడి చేశారని 48 శాతం మంది, కోడళ్లు దాడి చేశారని 28 శాతం మంది తెలిపారు. 52 శాతం మంది వృద్ధులు కీళ్లు, కండరాల నొప్పులతో, 16 శాతం మంది హైపర్‌ టెన్షన్‌తో, 14 శాతం మంది డయాబెటిస్‌తో, 13 శాతం మంది గుండె సంబంధిత రోగాలతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఎలాంటి సమస్యల్లేవని 10 శాతం మంది చెప్పారు.  


వృద్ధాప్యం చాలా మందిని మానసికంగా కుంగదీస్తోంది. కరోనాతో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. వైరస్‌ నుంచే కాకుండా కుటుంబీకుల నుంచి వృద్ధులకు ఎదురయ్యే వేధింపులు, వివక్ష, దాడుల నుంచి రక్షణ కల్పించాలి. ఇందుకోసం చట్టాలు, రక్షణల గురించి వాళ్లకు తెలిసేలా అవగాహన కల్పించాలి. 
- హిమాన్షు, ఏజ్‌ వెల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌