- జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫిజికల్, మెడికల్ టెస్ట్‌లు
- అర్ధరాత్రి 2.30 గంటలకు ప్రారంభించిన కలెక్టర్
వరంగల్, వెలుగు : గ్రేటల్ వరంగల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా సోమవారం ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ మొదలైంది. అర్ధరాత్రి 2.30 గంటలకు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, ఆర్మీ ఆఫీసర్లు హాజరై రిక్రూట్‌మెంట్ ర్యాలీని ప్రారంభించారు. మొదటి రోజైన సోమవారం ఆదిలాబాద్, వనపర్తి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించారు. రెండు జిల్లాల నుంచి మొత్తం 794 మంది హాజరుకావాల్సి ఉండగా.. 624 మంది ఫిజికల్ టెస్ట్‌లకు హాజరయ్యారు.
రిక్రూట్‌మెంట్ ర్యాలీకి హాజరయ్యే క్యాండిడేట్లను రాత్రి 10 గంటల నుంచే జేఎన్‍ఎస్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన మార్షలింగ్ ఏరియాలోకి పంపిస్తున్నారు. అక్కడ సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జేఎన్‍ఎస్‍లో నిర్వహించే రన్నింగ్ కోసం అక్కడ ఉండే హ్యాండ్ బాల్ కోర్టులోని బార్‌కోడ్ ఏరియాకు పంపిస్తున్నారు. ఆపై ఒక్కో బ్యాచ్‌లో 100 మంది చొప్పున సింథటిక్ ట్రాక్‍పై 1600 మీటర్ల దూరం రన్నింగ్ పోటీ నిర్వహిస్తున్నారు.
ఇందులో ఎంపికైన వారికి డోపింగ్ టెస్ట్‌లు నిర్వహించిన అనంతరం జిగ్‌జాగ్ రన్, చిన్ అప్స్, డిచ్ జంప్ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి ఎత్తు, బరువు, చాతీ కొలతలు వంటి మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. అన్ని టెస్ట్‌లలో ఎంపికయ్యే అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందేలా ఏర్పాట్లు చేశారు. కాగా, జిల్లాల వారీగా ఈ నెల 22 వరకు అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్‌లు కొనసాగనున్నాయి.
