- తాజ్‌మహల్ లాన్‌లో ప్రత్యేక ల్యాంప్స్
- గోడలపై ‘బ్రిజ్’ కల్చర్ కనిపించేలా పెయింటింగ్స్
- ట్రంప్ వెళ్లే దారిలో..13 కిలోమీటర్ల మేర సంప్రదాయ నృత్యాలు
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు ఆగ్రా ముస్తాబైంది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ట్రంప్ దంపతులు తాజ్‌మహల్ సందర్శించనున్నారు. అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన ఆగ్రా రానున్నారు. దాదాపు గంట పాటు తాజ్‌మహల్ దగ్గర గడుపుతారని, సన్‌సెట్ వరకు అక్కడే ఉంటారని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. తాజ్‌మహల్ అందాలు మరింత ఎక్కువగా కనిపించేలా లాన్‌లో విక్టోరియా స్టైల్ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు యమునా నీటిని రిలీజ్ చేస్తున్నారు. బ్రిజ్ సంస్కృతి, ఆర్కిటెక్చర్ గొప్పతనం కనిపించేలా ఆగ్రాలోని గోడలను కలర్‌ఫుల్ పెయింటింగ్స్‌తో ముస్తాబు చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తాజ్‌మహల్ వరకుట్రంప్ వెళ్లే దారిలో 13 కిలోమీటర్ల మేర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, మన సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేలా అక్కడక్కడా స్టేజ్‌లు కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. మెయిన్ సిటీలోని అన్ని రోడ్లను రిపేర్ చేశారు. డివైడర్లు కొత్తగా కనిపించేలా పెయింటింగ్స్ చేస్తున్నారు. గోడలకు దుమ్ము పట్టకుండా ప్రతిరోజు నీటితో కడుగుతున్నామని అధికారులు చెప్పారు. తాజ్‌మహల్ పరిసరాల్లో వర్కర్లు మార్బుల్స్, శాండ్ స్టోన్స్‌ను క్లీన్ చేస్తున్నారు. తాజ్‌మహల్ పరిసరాల్లోని షాపులన్నీ అందంగా కనిపించేందుకు యూనిఫామ్ సైన్ బోర్డ్స్‌ను పెట్టారు. వారం కిందటే షాపులన్నింటికీ బోర్డులు మార్చారని ఆగ్రాకు చెందిన షాప్ ఓనర్ ఒకరు చెప్పారు. తాజ్‌మహల్ దగ్గర్లోని ఫౌంటైన్లు అన్నీ క్లీన్ చేసి ప్రత్యేకంగా పూలతో అలంకరించారని, చూడటానికి చాలా అందంగా ఉన్నాయని అన్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా ఆగ్రాలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పోలీసులు, పారామిలటరీ ఫోర్స్‌తో పటిష్ట బందోబస్తు పెట్టారు.
వెలిసిన భారీ హోర్డింగ్స్
ట్రంప్ టూర్ నేపథ్యంలో ఆగ్రాలో భారీ హోర్డింగ్స్‌ను పెట్టారు. ఎయిర్‌పోర్ట్, తాజ్‌మహల్ దగ్గర వీటిని ఏర్పాటు చేశారు. ట్రంప్, మోడీ ఉన్న ఫొటోలతో వీటిని ఏర్పాటు చేశారు. ‘‘గంగా, యమునా లాంటి పవిత్ర నదులున్న భూమికి స్వాగతం” లాంటి కొటేషన్లలతో వాటిని ఏర్పాటు చేశారు.
