యూపీ లేదా బిహార్.. ఎక్కడైనా కాంగ్రెస్ పరిస్థితి అంతే

యూపీ లేదా బిహార్.. ఎక్కడైనా కాంగ్రెస్ పరిస్థితి అంతే

న్యూఢిల్లీ: బిహార్‌‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ నాలుగోసారి బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఆదివారం జరిగిన జాయింట్ మీటింగ్‌‌లో ఎన్డీయే కూటమి నేతలు నితీశ్‌‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయాలను పక్కనబెడితే.. బిహార్‌‌ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది.

ఆర్జేడీ తర్వాత అత్యధిక సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పందించారు. ఎన్డీయేను గెలిపించినందుకు బిహార్ ప్రజలకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘బీజేపీకి మహిళా ఓటర్లు దన్నుగా నిలిచారు. ఎన్డీయే గెలిచిన 125 సీట్లలో 99 చోట్ల మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండటమే దీనికి ఉదాహరణ. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)ని వెనక్కి లాగింది. బిహార్ కానివ్వండి, యూపీ అవ్వనీయండి.. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ చేసే పని అదే.. ఆ పార్టీ పరిస్థితి అంతే’ అని రవి శంకర్ పేర్కొన్నారు.