
- డ్రోన్లు, మొబైల్ యాప్ లపై ఏఈఓలకు శిక్షణ
- తర్వాత రైతులకు అవగాహన కార్యక్రమాలు
- శిక్షణా సంస్థల సాయం తీసుకోవాలని నిర్ణయం
- ఈ సీజన్ లో పంటల్లో వచ్చే మార్పులపై టెక్నికల్ సపోర్ట్
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం వ్యవసాయ విస్తరణ అధికారులకు సైంటిస్టులు, వ్యవసాయ వర్సిటీల శాస్త్రవేత్తలు, ఎన్జీఓల సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించి అవగాహన కల్పించనుంది. శిక్షణ పొందిన అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తారు.
ఈ వానాకాలం సీజన్‌లో పంటల్లో వచ్చే మార్పులు, చీడపీడల సమస్యలను టెక్నికల్ సపోర్టుతో పరిష్కరించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డ్రోన్లు, మొబైల్ యాప్‌లు తదితర ఆధునిక టెక్నాలజీ వినియోగంపై శిక్షణ కల్పిస్తారు. జిల్లాల వారీగా ఈ అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
చీడపీడల గుర్తింపులో మొబైల్ యాప్ లు
వ్యవసాయ రంగంలో 2025లో ప్రధానంగా ఏఐ, ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలో ఏఐని వ్యవసాయ సలహాలు, రోగ నిర్ధారణ, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో వినియోగిస్తున్నారు. ఉదాహరణకు, డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ, నీటి వినియోగం ఆప్టిమైజేషన్, చీడపీడల గుర్తింపు సాధ్యమవుతోంది. హైదరాబాద్‌లోని ప్రెసిషన్ ఫార్మింగ్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా జీపీఎస్ గైడెన్స్ సిస్టమ్స్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్‌ను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు.
ఎరువులు, పురుగుమందులను సరైన మోతాదులో వాడడంలో ఇవి సహాయపడతాయి, దీంతో పర్యావరణ రక్షణతోపాటు దిగుబడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చీడపీడల గుర్తింపులో మొబైల్ యాప్‌లు కీలకంగా మారాయి. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ యాప్ చీడపీడల సమాచారాన్ని సేకరించి తక్షణ సలహాలు అందిస్తుంది. ప్లాంటిక్స్, కిసాన్ ఏఐ వంటి యాప్‌లు ఏఐ ఆధారంగా పంట రోగాలను గుర్తించి, స్థానిక భాషల్లో సలహాలు ఇస్తాయి. ఇవి హిందీ, తెలుగు, కన్నడ వంటి భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
తుమైని, ఆగ్రియో వంటి యాప్‌లు పంటల ఫొటోల ద్వారా రోగాలు, చీడలను గుర్తించి, సురక్షిత చికిత్సా విధానాలు సూచిస్తాయి. రాష్ట్ర ఇజ్రాయెల్ టెక్నాలజీని అనుసరించి రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు చీడపీడల సమస్యలను ముందుగానే గుర్తించి నివారించడంలో సహాయపడనున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి శిక్షణలను జిల్లాల వారీగా విస్తరించి క్షేత్రస్థాయి అధికారులకు, రైతులకు అవగాహన కల్పించనున్నారు.
అగ్రికల్చర్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్లు, ఎన్జీఓల సహకారం
ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఏయూ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) తో పాటు పలు ఎన్జీఓల సహకారంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుది. 2025–-26 శిక్షణ క్యాలెండర్‌లో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, -ఖరీఫ్ ప్రాక్టీసెస్ వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా ఏఈఓలకు శిక్షణ ఇస్తారు. తర్వాత ఏఈఓలు రైతులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తారు. ఈ సాంకేతికతల వినియోగంతో రైతుల దిగుబడి 20 నుంచి -30 శాతం పెరిగే అవకాశం ఉందని అగ్రికల్చర్ నిపుణులు పేర్కొంటున్నారు.