పంటల కలుపు తీయాలంటే కూలీలు దొరకరు. కలుపు తీసే మెషీన్ కొందామంటే.. వేలకు వేల రూపాయలు కావాలి. అందుకే పెట్టుబడి ఎక్కువగా పెట్టలేని చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ సెంటర్ పెట్టారు. ఇక్కడ అన్ని రకాల అగ్రికల్చర్ మెషీన్లు అద్దెకు ఇస్తారు. ఈ సెంటర్‌ని సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో ఈ మధ్యే మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎక్కడుందంటే..
భీమదేవరపల్లి, వెలుగు: మహిళలకు ఉపాధి కల్పించేందుకు, సన్నకారు రైతులకు సాయం చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. వ్యవసాయ అవసరాలకు వాడే మెషీన్లను కిరాయికి ఇచ్చే సెంటర్లను వెయ్యికి పైగా మంజూరు చేసింది. వీటిని దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌లో ఒక ‘కస్టమ్ హైరింగ్ సెంటర్’ను ఏర్పాటు చేశారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మెషీన్ కింద ఏర్పాటు చేసిన ఈ సెంటర్లు డిస్ట్రిక్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేస్తాయి. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ మెంబర్స్ వీటిని నడుపుతున్నారు. ఇందులో రైతులకు తక్కువ ధరకే మెషీన్లను కిరాయికి ఇస్తున్నారు.
డిస్ట్రిక్ట్ పర్చేజింగ్ కమిటీ
కలెక్టర్ ప్రెసిడెంట్‌గా ఉండే ‘డిస్ట్రిక్ట్ పర్చేజింగ్ కమిటీ’ రైతులకు ఉపయోగపడే అత్యాధునిక వ్యవసాయ పరికరాలు కొనేందుకు కావాల్సిన డబ్బు ఇస్తుంది. ములుకనూర్‌లోని ‘కస్టమ్ హైరింగ్ సెంటర్’కు ట్రాక్టర్, ట్రాలీ, రోటవేటర్, కల్టివేటర్, ఫ్లవ్, ప్యాడి బేటర్, మేజ్ షెల్లర్ లాంటి పనిముట్లు కొనిచ్చారు. పంటలకు మందులు స్ర్పే చేసే మెషీన్లు కూడా ఇచ్చారు. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ సభ్యులు హార్వెస్టర్, మినీ రైస్ మిల్లు లాంటి మెషీన్లు కావాలని తీర్మానాలు చేస్తే అవి కూడా కొనిస్తారు.
సభ్యులే చూసుకుంటారు
ఈ సెంటర్ నుంచి అందించే ప్రతి మెషీన్‌ని సభ్యులే చూసుకుంటారు. మొదటగా ఇన్వార్డ్ రిజిస్టర్, బుక్ ఆఫ్ అకౌంట్స్‌లో ఏ రైతుకు, ఏ మెషీన్, ఎప్పుడు అవసరం ఉంటుందో రాస్తారు. తర్వాత బయట మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు కిరాయికి ఇస్తారు. వీటితో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ మార్కెట్, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా డీఆర్డీఏ రెడీగా ఉంది.
– గజ్జెల దేవానంద్, ఎపియం
పేద రైతుకు వరం
భారతమాత మండల సమాఖ్య ఆధ్వర్యంలో 11,584 మంది సభ్యులు, 49మంది వివోలు, 1,012 ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. మెంబర్స్‌కు పొదుపు సౌకర్యంతో పాటు అప్పులు కూడా ఇస్తున్నారు. ములుకనూర్, ముత్తారం, కొప్పూర్, భీమదేవరపల్లి, కొత్తపల్లి గ్రామాల రైతులకు వ్యవసాయ పెట్టుబడి తగ్గించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇది పేద రైతులకు వరం లాంటిది.
– పుల్ల సరిత, భారతమాత సమాఖ్య ప్రెసిడెంట్
For More News..
మనుషులకే కాదు.. పసులకూ ఓ హాస్టల్
స్టూడెంట్లకు పూలతో స్వాగతం పలుకుతున్న స్కూల్స్
రిపబ్లిక్ డే ‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే
