నస్పూర్, వెలుగు: ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం అని మంగళవారం సీఐటీయూ నాయకులు మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట అందోళన చేశారు. దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసీ కనుమరుగై, ప్రైవేట్ కంపెనీలు మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఆర్టీసీకి ఇవ్వాలని, విద్యుత్ బస్సులను సమకూర్చుకునేందుకు సహకరించాలని కోరారు.
బడ్జెట్లో నిధులు కేటాయించాలని సూచించారు. ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వరి, దేవదాస్, ప్రకాశ్, జిల్లా కమిటీ సభ్యులు, రబియా, కుమారస్వామి, సంతోష్, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.
