30 శాతం మించని పంటలు..పత్తి మాత్రమే 90 శాతం పూర్తి

30 శాతం మించని పంటలు..పత్తి మాత్రమే 90 శాతం పూర్తి
  • వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులు
  • ఆగస్టు వచ్చినా పూర్తికాని వరి నాట్లు
  • వనపర్తిలో పడిపోయిన పల్లి సాగు
  • సగానికి తగ్గిన మక్క, జొన్న, కంది పంటలు
  • ఒక్క నారాయణపేట జిల్లాలోనే 78 శాతం సాగు 
  • ఉమ్మడి జిల్లాలో ఇదీ వ్యవసాయ పరిస్థితి

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వ్యవసాయం చతికిల పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వరి, పల్లి, జొన్న, మిర్చి, మక్కల సాగు గణనీయంగా తగ్గిపోయింది. పత్తి(90 శాతం) తప్ప ఇతర ఏ పంటలూ వ్యవసాయ శాఖ అంచనాకు 30‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాతానికి మించి సాగు కాలేదని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క నారాయణపేట జిల్లాలో మాత్రం 78 శాతం పంటలు సాగయ్యాయి. 

వరి, పల్లి 10 శాతమే..

పదేండ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలో వానలు లేక చెరువులు వెలవెలబోతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఈ ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా ఉంది. ఆగస్టు మొదటి వారంలోపే సాగు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా పుంజుకోవడం లేదు. వ్యవసాయ శాఖ వేసిన అంచనా ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో 8.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. కానీ ఇప్పటివరకు 1.57 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. పాలమూరు, నాగర్​కర్నూల్​జిల్లాల్లో 10 శాతం కూడా కాలేదు.

సాగునీటి ఇబ్బందులు ఉండడంతో రైతులు వరి నాట్లకు ముందుకు రావడం లేదు. పది రోజుల కింద పడిన వానలకు కొందరు జనుము విత్తనాలు వేయగా మొలకెత్తి ఎండిపోతున్నాయి. నారు ముదిరిపోతోంది. వనపర్తి పల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. కానీ వర్షాలు లేక ఇప్పటివరకు ఆ పంట 6 శాతం కూడా సాగవలేదు. రానున్న వారం, పది రోజుల్లో ఆశించిన స్థాయిలో వానలు పడితేనే ఈ పంటల సాగుకు అవకాశం ఉంది. లేదంటే ఇక అంతే. మక్క, జొన్న, కంది, మిర్చి పంటల పరిస్థితీ ఇలాగే ఉంది.

ఆగస్టు దాటితే కష్టమే..

వరి నాట్లకు ఈ నెలతోపాటు సెప్టెంబర్​మొదటి వారం వరకు టైం ఉంది. ఆలోపు నాట్లు పూర్తయితే జనవరి చివరలో పంట చేతికొస్తుంది. అయితే మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవి రైతులను కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఆలస్యంగా సాగు జరిగిన ప్రాంతాల్లో ఈ వానల వల్ల పంటలకు నష్టం జరుగుతోంది. వరి, వేరుశనగ పంటలకు తెగుళ్లు సోకి దిగుబడి రావడం లేదు. వర్షాలకు వాతావరణంలో తేమ శాతం పెరిగి దిగుబడిపై ఎఫెక్ట్​పడుతోంది. తీవ్రమైన చలి వల్ల వరి కంకులు ఎదగని పరిస్థితి ఉంది. 

నాగర్​కర్నూల్ జిల్లాలో.. సాగు అంచనా : 5,38,462 ఎకరాలు, సాగైంది : 3,19,221 ఎకరాలు

పంట    టార్గెట్​    సాగైంది

వరి    1,60,021    10,931
పత్తి    2,86,471    2,54,342
మక్క    72,929    46,553
జొన్న     7,822    4,037
కంది    6,900    2,866

జోగులాంబ గద్వాల జిల్లాలో..సాగు అంచనా : 4,25,949 ఎకరాలు, సాగైంది : 1,73,211 ఎకరాలు

పంట    టార్గెట్​    సాగైంది

వరి    94 వేలు     12,618
పద్ది    94,386    1,09,932
మిర్చి    75,843    2,938
మక్క    15,266    7,685
కంది    26,249    1,156

మహబూబ్​నగర్​ జిల్లాలో.. సాగు అంచనా : 3.64 లక్షల ఎకరాలు, సాగైంది : 1.50  లక్షల ఎకరాలు

పంట    టార్గెట్​    సాగైంది

వరి    2 లక్షలు    8 వేలు
పత్తి    95 వేలు     85 వేలు 
కంది     10 వేలు    6 వేలు
మక్క    22 వేలు    35 వేలు
జొన్న    8 వేలు    5 వేలు

వనపర్తి జిల్లాలో.. సాగు అంచనా : 2,82,665 ఎకరాలు,  సాగైంది : 70,014 ఎకరాలు

పంట    టార్గెట్​       సాగైంది

వరి         2,05,065    45,035
పత్తి         15,303      12,689
పల్లి          8,268      267
జొన్న       2,020      939
మక్కలు    9,475     6,514

నారాయణపేట జిల్లాలో..  సాగు అంచనా : 4.16 లక్షల ఎకరాలు ,సాగైంది : 3.20 లక్షల ఎకరాలు

పంట       టార్గెట్​       సాగైంది

వరి        1.80 లక్షలు    80 వేలు
పత్తి       1.57 లక్షలు    1.57 లక్షలు
కంది      60 వేలు          60 వేలు
జొన్న      6 వేలు           6 వేలు
పెసర్లు     5,400           5,400