ఇండియా - శ్రీలంక మధ్య మూడు టీ 20లు, 3 వన్డేల సిరీస్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ‘కిట్’లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ ‘కిట్’ స్పాన్సర్ స్థానంలో కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్ (కేకేసీఎల్) వచ్చింది. ఎంపీఎల్‌తో ఈ ఏడాది మార్చి వరకు బీసీసీఐకి ఒప్పందం ఉంది. అయితే తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్ బోర్డును ఇటీవలే కోరింది. ఈ క్రమంలో మూడు నెలల స్వల్ప కాలానికి కేకేసీఎల్ తెరపైకి వచ్చింది.
ఈ సందర్భంగా ముంబైలో జరగనున్న ఆ మ్యాచ్ కన్నా ముందే.. టీమిండియా ప్లేయర్లు తమ జెర్సీ ఫోటోలను రిలీజ్ చేశారు. ప్లేయర్లు ధరించిన ఈ బ్లూ జెర్సీలపై కొత్త లోగో ఉండడాన్ని ఈ ఫొటోల్లో గమనించవచ్చు. చాహల్ తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఫొటోలో ఆ కొత్త లోగోను గుర్తుపట్టవచ్చు. అయితే ఈ కొత్త లోగోపై బీసీసీఐ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. కానీ కిల్లర్ లోగో ఉన్న జెర్సీలు ధరించిన ప్లేయర్ల వీడియోను మాత్రం బీసీసీఐ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.