అలర్జీలను గుర్తించే ఏఐ: 95% కచ్చితత్వంతో కారణాలను గుర్తిస్తున్న ఆధునిక టెక్నాలజీ

 అలర్జీలను గుర్తించే ఏఐ: 95% కచ్చితత్వంతో కారణాలను గుర్తిస్తున్న ఆధునిక టెక్నాలజీ

వేసవి ఎండతోపాటు ఎన్నో అలర్జీలను మోసుకొస్తుంది. అందుకే చాలామంది ముక్కు కారడం, తుమ్ములు, కళ్లు ఎర్రబడడం, దురద లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే.. వసంతకాలంలో చెట్లు, గడ్డి, కలుపు మొక్కల పరాగసంపర్కం జరుగుతుంది. ఈ టైంలో గాలిలోకి విడుదలయ్యే సూక్ష్మమైన పుప్పొడి రేణువులు శ్వాస ద్వారా శరీరంలోకి చేరి అలర్జీని కలిగిస్తాయి. దాన్నే సీజనల్ అలర్జిక్ రైనైటిస్ (ఎస్‌‌ఏఆర్‌‌‌‌) అంటారు. అయితే.. ఇప్పటివరకు సైంటిస్ట్‌‌లు ఎన్నో రకాల అలర్జెన్లను గుర్తించారు. కానీ.. ఒక వ్యక్తికి దేనివల్ల అలర్జీ వచ్చిందో అని కచ్చితంగా చెప్పడం చాలా కష్టం. ఏఐ మాత్రం ఎలాంటి అలర్జీనైనా ఈజీగా గుర్తిస్తోంది. 

ఈ మధ్య వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం.. అలర్జీ దేనివల్ల వచ్చిందనేది ఏఐ 95శాతం కంటే ఎక్కువ కచ్చితత్వంతో గుర్తించింది. 24 మంది అనుభవజ్ఞులైన డాక్టర్ల కంటే ఇది వేగంగా అలర్జీ కారకాలు గుర్తించగలిగింది. 

ట్రైనింగ్‌‌ ఇచ్చి.. 

ఇటలీలోని ఐటీ –2020 ప్రాజెక్ట్‌‌లో భాగంగా శాస్త్రవేత్తలు ఒక మాడ్యులర్ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (సీడీఎస్‌‌ఎస్‌‌)ను అభివృద్ధి చేశారు. ఇందులో మూడు దశలు ఉన్నాయి.. క్లినికల్ హిస్టరీ + స్కిన్ ప్రిక్ టెస్ట్ (చర్మంపై అలర్జెన్లను పరీక్షించడం), రక్తంలో అలర్జీ యాంటీబాడీలను గుర్తించడం, రోగి లక్షణాలు, పర్యావరణ పరిస్థితులను రోజువారీగా నోట్ చేయడం. ఈ మూడింటి డేటాతో మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌‌కు ట్రైనింగ్‌‌ ఇచ్చారు. ఆ తర్వాత రోగి డేటాని ఇచ్చి టెస్ట్‌‌ చేశారు. ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చాయి. ఇటలీలోని రోగులతో పాటు అల్బేనియాలోని మరో 92 మందిపై కూడా పరీక్షించారు. అప్పుడు కూడా ఫలితాలు ఒకేలా వచ్చాయి. అంటే ఈ ఏఐ వ్యవస్థ ఎలాంటి వాతావరణంలో ఉంటున్న రోగులకైనా ఒకేలా పనిచేస్తోంది. 

పర్ఫెక్ట్‌‌.. 

సాధారణంగా అలర్జీ నిర్ధారణ అనేది డాక్టర్ అనుభవం, రోగి హిస్టరీ, టెస్ట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎక్కడ తప్పు జరిగినా అలర్జెన్లను గుర్తించడం కష్టం అవుతుంది. కానీ.. ఏఐ మాత్రం చాలా ఈజీగా వేలాది డేటా పాయింట్లను వేగంగా విశ్లేషించి, నమూనాలను గుర్తిస్తుంది. అలర్జీ మూలాలు తెలియకపోతే రోగులు నెలల తరబడి యాంటీహిస్టమిన్ మాత్రలు, స్ప్రేలు వాడాల్సి వస్తుంది. మూలాలను గుర్తిస్తే.. సరైన అలర్జెన్‌‌ స్పెసిఫిక్‌‌ ఇమ్యునోథెరపీ (ఏఐటీ) ఇచ్చి రోగికి తొందరగా ఉపశమనం కలిగించవచ్చు.