
- ఇది నిజంగా జరుగుతుంది..
- అమెరికాలోని లూయివిల్ వర్సిటీ ప్రొఫెసర్ హెచ్చరిక
- ప్రత్యామ్నాయం లేదని వెల్లడి
వాషింగ్టన్: ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తో 2030 లోపు 99 శాతం ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఉంది. అమెరికాలోని లూయివిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రోమన్ యాంపోల్ స్కీ ఈ విషయం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకోవడానికి ఏఐ సిస్టమ్స్ ను వాడుతున్నాయని, దీంతో వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల్లో భారీగా కోతపడుతుందని ఆయన హెచ్చరించారు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కోడర్లు, ప్రాంప్ట్ ఇంజినీర్ల ఉద్యోగాలు కూడా సేఫ్ కాదని, రానున్న ఆటోమేషన్ వేవ్ తో దాదాపు అన్ని ఉద్యోగాలకు ముప్పు తప్పదని ఆయన చెప్పారు. ‘‘ఇంతకుముందెన్నడూ చూడని నిరుద్యోగాన్ని వచ్చే ఐదేళ్లలో మనం చూడబోతున్నాం.
అది 10 శాతమో, 20 శాతమో కాదు. ఏకంగా 99 శాతం. 2027లోపు మానవ తరహా మేధస్సు లేదా ఆర్టిఫిషియెల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) రాబోతున్నది. ఏజీఐ వచ్చిన మూడేళ్లకు లేబర్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది. ఏఐ టూల్స్, హ్యుమనాయిడ్ రోబోలతో మనుషులు చాలా చవకగా పని చేయించుకుంటారు. అంతేకాకుండా, కంప్యూటర్ లో చేసే ప్రతి పని ఏఐ టూల్స్ తో ఆటోమేటిక్ అయిపోతుంది” అని యాంపోల్ స్కీ పేర్కొన్నారు. హ్యుమనాయిడ్ రోబోలు కేవలం ఐదేండ్ల దూరంలో ఉన్నాయని, వాటి రాక తర్వాత ఫిజికల్ లేబర్ ఆటోమేటెడ్ అయిపోతుందని ఆయన చెప్పారు. దానితో పాటు ఉద్యోగాలన్నీ ఆటోమేటెడ్ అయిపోతాయని, ఏఐకు ప్రత్యామ్నాయమే లేదని తెలిపారు. కాగా.. ఈ ఏడాది మేలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమొడెయ్ కూడా ఇలాగే హెచ్చరించారు. ఏఐతో 50 శాతం వైట్ కాలర్ జాబ్స్ లో కోతపడుతుందని ఆయన తెలిపారు.