V6 News

జెమిని, జీపీటీ-5.2, క్లాడ్ AIల చేతికి అణుబాంబులు ఇస్తే ఏమవుతుంది? షాకింగ్ నిజాలు బయటపెట్టిన రీసెర్చ్

జెమిని, జీపీటీ-5.2, క్లాడ్ AIల చేతికి అణుబాంబులు ఇస్తే ఏమవుతుంది? షాకింగ్ నిజాలు బయటపెట్టిన రీసెర్చ్

భవిష్యత్తులో AI మానవాళికి రక్షణగా నిలుస్తుందా లేక వినాశనానికి దారితీస్తుందా అనే చర్చకు తాజా పరిశోధన ఒకటి ఆజ్యం పోసింది. బ్రిటన్ పరిశోధకుడు కెన్నెత్ పేన్ నిర్వహించిన ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో జెమిని, క్లాడ్, ఓపెన్ ఏఐకి చెందిన GPT-5.2 మోడల్స్‌కు అణుబాంబుల నియంత్రణ అధికారాన్ని అప్పగించారు. అణు సంక్షోభం తలెత్తినప్పుడు ఈ ఏఐలు ప్రత్యర్థి దేశాల నాయకులైతే ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయి. ఎలా రియాక్ట్ అవుతాయో పరీక్షించడమే ఈ స్టడీ లక్ష్యం. అయితే ఆయన అడిగిన ప్రశ్నలకు ఏఐ మోడళ్లు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచం అంతగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

అయితే ఈ ప్రయోగం ఊహించని, భయాందోళన కలిగించే ఫలితాలను ఇచ్చింది. యుద్ధం తీవ్రతరమైన ప్రతి సందర్భంలోనూ ఈ 3 ఏఐ మోడల్స్ న్యూక్లియర్ వార్ వైపు మొగ్గు చూపడం సైంటిస్టులను కూడా విస్మయానికి గురిచేసింది. ఎదుటి పక్షం నుంచి చిన్నపాటి ముప్పు పొంచి ఉన్నా సరే.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి బదులుగా ఏఐలు అణు క్షిపణులను ప్రయోగించేందుకే సిద్ధపడ్డాయి. ప్రత్యర్థి అణు హెచ్చరికలు చేసినప్పుడు.. ఇవి వెనక్కి తగ్గకుండా మరింత తీవ్రమైన దాడులతో ప్రతిస్పందించాయని స్టడీ వెళ్లడించింది. 

మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క ఏఐ మోడల్ కూడా లొంగిపోవడానికి లేదా యుద్ధాన్ని విరమించుకోవడానికి ఇష్టపడలేదట. అంటే ఓటమి అంచున ఉన్నా సరే.. ఏఐ మోడల్స్ సంధి కంటే సర్వనాశనాన్ని కోరుకున్నాయి. తాను కేవలం శాంతిని కోరుకుంటున్నాను అని పైకి చెబుతూనే.. చివరి నిమిషంలో అణు యుద్ధం దిశగా నడవటం వీటిలో కనిపించిన విచిత్రమైన ధోరణి. అణు ఆయుధాల వంటి సున్నితమైన అంశాలను ఏఐ నియంత్రణలోకి వదిలేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. ఏఐ నిర్ణయాల వెనుక ఉండే లాజిక్స్.. మనిషిలా భావోద్వేగాలను కలిగి ఉండకపోవటం, ప్రాణ నష్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదని స్టడీ ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.