తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్ర జ‌రుగుతోంది

తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే కుట్ర జ‌రుగుతోంది

పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణను ఎడారిగా మార్చి రాయలసీమను రతనాలసీమగా మార్చే కుట్ర జ‌రుగుతుంద‌ని ఏఐసీసీ కార్యదర్శి చ‌ల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం గాంధీభ‌వ‌న్ లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ… కేసీఆర్ అహంకారం వల్ల, అంతా త‌న‌కే తెలుసు అనే భావన వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పునాది నీళ్లు, నిధులు, నియామకాలు. నేడు కేసీఆర్ అసమర్ధ, నియంతృత్వ, అహంకార పాలనలో నీళ్లు ఆంధ్రోళ్లకు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు, నియామకాలు కేసీఆర్ ఇంటి పాలైతున్నవని వంశీచంద్ అన్నారు. మ‌రీముఖ్యం గా సాగునీటి రంగంలో కేసీఆర్ వ్యవహారం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని చెప్పారు.

కేసీఆర్ వల్ల కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జ‌రిగింద‌ని, దక్షిణ తెలంగాణ అన్యాయానికి కేసీఆర్ అసమర్థత, అహంకారమే కారణమ‌ని అన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల వివక్షపై, కేసీఆర్ నిర్లక్ష్యంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు.

2005 సం.లో పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 11000 క్యూసెక్కుల నుంచి 44000కు పెంచినప్పుడు మీరు మీ మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయలేదు? అని సీఎం నుద్దేశించి ప్ర‌శ్నించారు. ఆంధ్రోళ్లు కృష్ణా బేసిన్ నీళ్లను కృష్ణేతర బేసీన్లకు తరలించుకుపోతుంటే ఎందుకు ఉద్యమించలేదు? అని అడిగారు. సామర్ధ్యం పెంచినప్పుడు పాత పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ హామీ ఇచ్చినప్పటికీ, ముఖ్యమంత్రిగా ఉండి కూడా పాత 4 తూములు ఎందుకు మూయించలేదు? అని అన్నారు. మే 5 నాడు ఆంధ్రప్రదేశ్ GO 203 విడుదల చేస్తే, దానిపై స్పందించడానికి వారం రోజులు ఎందుకు పట్టింది? పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రి మిటార్లను ఎందుకు అమర్పించలేక పోయినరు? అని ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు వంశీచంద్.