రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే : క్రిస్టోఫర్​ తిలక్

రానున్నది కాంగ్రెస్​ ప్రభుత్వమే : క్రిస్టోఫర్​ తిలక్

వేములవాడరూరల్, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 65 నుంచి 70 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్​ తిలక్, వేములవాడ కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయన్నారు.

కేంద్రంలో మోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, తెలంగాణలో సీఎం కేసీఆర్​2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. 10 ఏళ్ల లో బీఆర్ఎస్ గ్యాస్​సిలిండర్​రూ.400 కు ఎందుకు ఇవ్వలేదన్నారు. సమావేశంలో జడ్పీటీసీ నాగం కుమార్, లీడర్లు రామస్వామి, శ్రీనివాస్, గణేశ్‌‌, రేణుక, రాంరెడ్డి, ముకుంద రెడ్డి, మధు,  పద్మ, రవీందర్‌‌‌‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు. 

ఒక్క అవకాశం ఇవ్వండి..

వేములవాడ: డబ్బుల ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని, 20 ఏండ్లుగా మీ కష్టా సుఖాల్లో తోడున్నానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని వేములవాడ కాంగ్రెస్​అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు.  వేములవాడ పట్టణంలోని హరిమల గార్డెన్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజన్న ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు. వెనకబడిన వేములవాడను ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.