
హైదరాబాద్, వెలుగు: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేసి, అనైతిక పద్ధతిలో గద్దెనెక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఆరోపించారు. జార్ఖండ్‌లో బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించామని, బిహార్‌లోనూ ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తామని అన్నారు. సంపత్ కుమార్ సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
రేవంత్ సర్కార్ తెలంగాణతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే జార్ఖండ్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించామని, ఇప్పుడు బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ఈ నెల 11వ తేదీదాకా బిహార్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉంటారని చెప్పారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని సంపత్ మండిపడ్డారు. జార్ఖండ్, బిహార్‌లో జరిగిన వ్యవహారం, కేటీఆర్‌కు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్, హరీశ్ రావు, బాల్క సుమన్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు.