కాసేపట్లో కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ భేటీ

కాసేపట్లో కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ భేటీ

హైదరాబాద్​ : కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో  AICC సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భేటీ కానున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడిన దిగ్విజయ్ ఇవాళ నేరుగా వారితో సమావేశమై పార్టీ పరిస్థితిపై మాట్లాడనున్నారు. వేర్వేరుగానాయకులతో భేటీ కానున్న దిగ్విజయ్..అందరి అభిప్రాయాలను తీసుకోనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్లు దిగ్విజయ్ సింగ్ తో భేటీలో ఏం చెప్తారనేది ఉత్కంఠగా మారింది. కమిటీల్లో చోటు, ఇతర అంశాలపై అసంతృప్తిగా ఉన్న నేతలను  దిగ్విజయ్ బుజ్జగించే ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్ లో దిగ్విజయ్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 

ప్రస్తుతం రెండు వర్గాల వ్యవహారంతో కాంగ్రెస్ క్యాడర్ లో అయోమయం నెలకొంది. సంక్షోభం పరిష్కారానికి దిగ్విజయ్ సింగ్​ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. రెండు వర్గాల మధ్య సమన్వయం కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను తెలంగాణ రాష్ట్రానికి పంపించిన విషయం తెలిసిందే. 

నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ కు పీసీసీ ప్రొటోకాల్ ఇన్ చార్జ్ హర్కర వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్​కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. దిగ్విజయ్ హోటల్​కు రాగానే కాంగ్రెస్​ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గా పని చేయడంతో పాటు తెలంగాణ ఏర్పడ్డాక కూడా కొంత కాలం పని చేశారు. కాంగ్రెస్ లోని రాష్ట్ర నేతలందరితోనూ దిగ్విజయ్ కు పరిచయాలు ఉన్న నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు అధిష్టానం దిగ్విజయ్​ని పంపింది.