మంది తక్కువ.. పని ఎక్కువ

మంది తక్కువ.. పని ఎక్కువ
  • ఇదీ దేశంలోని ఆస్పత్రుల పరిస్థితి
  • ఎయిమ్స్ లోనూ ఇంతేనన్న రీసెర్చర్లు
  • రెండు ఇండియా ఆస్పత్రులు,రెండు విదేశీ ఆస్పత్రులపై స్టడీ
  • అక్కడి కన్నా ఎక్కువ పేషెంట్లు,తక్కువ డాక్టర్లు, తక్కువ నిధులు

న్యూఢిల్లీ:

ఒక్కరు ఇద్దరు కాదు.. బీహార్​లో ఏకంగా 150 మందికిపైగా చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోయారు. ఈ ఒక్క ఘటన దేశంలో పేద ప్రజలకు అందుతున్న మెడికల్ సర్వీసులపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఇండియాలో ఉన్న చాలా ఆస్పత్రులు అంత నాణ్యమైనవి కాదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఏదైనా అరుదైన వ్యాధి వస్తే, ప్రజల ప్రాణాలను కాపాడటం మన ఆస్పత్రులకు సాధ్యమేనా? అనే ఆందోళనను అందరిలోనూ రేకెత్తించింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక మెడికల్ సర్వీసులు అందించే ఆలిండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోనూ పరిస్థితి ఇలానే ఉందనే చేదు నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.

రెండు విదేశీ ఆస్పత్రులతో పోలిస్తే..

ఢిల్లీలోని ఎయిమ్స్, వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ)లను… అమెరికాలోని సెడర్స్ సినయ్ మెడికల్ సెంటర్, బ్రిటన్​లోని సెయింట్ థామస్ హాస్పిటల్​తో పోల్చి చూశారు రీసెర్చర్లు. వాటితో పోలిస్తే ఎయిమ్స్, సీఎంసీల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని తమ అనాలిసిస్​లో తేల్చారు. 2017–18లో ఎయిమ్స్, సీఎంసీలో సుమారు 20 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లు చికిత్స తీసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అమెరికా, బ్రిటన్​లోని ఆస్పత్రులతో పోలిస్తే ఇది రెండు రెట్ల కన్నా ఎక్కువ.

ఒక్కో బెడ్​కు 100 మంది

సెడర్స్, థామస్ ఆస్పత్రులతో పోలిస్తే ఎయిమ్స్, సీఎంసీలకు వచ్చే అవుట్​పేషెంట్ల సంఖ్య రెండు రెట్లు ఎక్కువ. అదే ఇన్​పేషెంట్ల విషయానికి వస్తే 1.6 రెట్లు ఎక్కువ. ఎయిమ్స్​లో ఏడాదికి ఒక్కో బెడ్​కు సుమారు 100 మంది పేషెంట్లు చొప్పున చికిత్స అందిస్తారు. అంటే సగటున ఒక్కో పేషెంట్ నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు బెడ్డుపై ఉండే అవకాశం లేదు. ఆస్పత్రికి అంత రద్దీ ఉంటుంది. ఎయిమ్స్ లో ఇన్​పేషెంట్​గా చేరాలంటే ఎంత కష్టమో ఈ పరిస్థితే తెలియజేస్తోంది. ఎయిమ్స్, సీఎంసీ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లలో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఎక్కువ. తమిళనాడులో ఉన్న సీఎంసీ ఆస్పత్రికి 2017–18లో వచ్చిన ఇన్​ పేషెంట్లలో దాదాపు 46 శాతం మంది ఇతర రాష్ర్టాల వారే. ఇక ఎయిమ్స్ కు వచ్చిన ఇన్​పేషెంట్లలో 53 శాతం మంది ఢిల్లీ బయటి ప్రాంతాల వారే. ఇందులో ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే పేషెంట్లే ఎక్కువ. మరోవైపు మిగతా మూడు ఆస్పత్రులతో పోలిస్తే ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది.

ఎయిమ్స్​లో పని ఒత్తిడి

ఎయిమ్స్​లో ప్రస్తుతం ఉన్న డాక్టర్లు 700 మంది. కానీ ఏటా లక్షలాది మంది ఔట్ పేషెంట్లు, లక్ష మందికిపైగా ఇన్​పేషెంట్లు వస్తున్నారు.   సుమారు 2 వేల మంది ట్రైనీ   డాక్టర్లు వారికి సాయం అందిస్తున్నారు. ‘‘ 90 శాతం పని రెసిడెంట్ డాక్టర్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా, ఫ్యాకల్టీ వచ్చే వరకు వారే చూసుకుంటున్నారు. వారిపై  పని ఒత్తిడి ఉంది” అని  రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ చెప్పారు.

మన ఆస్పత్రులకు వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు (2017-18)

హాస్పిటల్                                        ప్రతిరోజుకు వచ్చే అవుట్ పేషెంట్లు           ఒక్కోబెడ్ కు ఏడాదికి ఇన్ పేషెంట్లు

ఎయిమ్స్(ఢిల్లీ)                                                               5,721                          99

సీఎంసీ(వెల్లూరు)                                                            5,982                         49

విదేశీ ఆస్పత్రులకు వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు (2017-18)

సెయిం ట్ థామస్ (బ్రిటన్)                                                    3,512                     70

సెడెర్స్–సినయ్ (అమెరికా)                                                    2,176                     57