కోవ్యాక్సిన్ ను మ‌నుషులపై ప్ర‌యోగిస్తున్నారు

కోవ్యాక్సిన్ ను మ‌నుషులపై ప్ర‌యోగిస్తున్నారు

మ‌న‌దేశంలో తొలిసారి క‌రోనా వ్యాక్సిన్ ను మ‌నుషుల‌పై ప్ర‌యోగిస్తున్నారు. స్వ‌దేశానికి చెందిన కోవ్యాక్సిన్ ను పాట్నాలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్ర‌యోగిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ త‌యారు చేసిన కోవాక్సిన్ ను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వేరు చేయబడిన సార్స్ కోవిడ్ -2 యొక్క జాతి నుంచి వేరు చేసిన వైరస్ పై ప్ర‌యోగాలు జ‌ర‌ప‌నున్నారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఎంపిక చేసిన 10మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ను ప్ర‌యోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం టీకా తొలిసారి ప్ర‌యోగం జ‌రిపిన 14రోజుల త‌రువాత రెండోసారి టీకాను ఇంజెక్ట్ చేస్తారు.

అనుకున్న ప్ర‌కారం షెడ్యూల్ పూర్తైన వెంట‌నే టీకా ఇచ్చిన వాలంటీర్ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయ‌నే అంశంపై టెస్ట్ లు నిర్వ‌హిస్తార‌ని ఎయిమ్స్-పాట్నా సూపరింటెండెంట్ డాక్టర్ సిఎం సింగ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ లింగ‌బేధం సంబంధం లేకుండా 22-50 సంవత్సరాల మధ్య వయసున్న ఆరోగ్యవంతులపై ఈ టీకాను ప్ర‌యోగిస్తున్నట్లు చెప్పారు.

భారత్ బయోటెక్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ  మాట్లాడుతూ తాము త‌యారు చేసిన టీకా వైర‌స్ ను నాశ‌నం చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. పూర్తిస్థాయిలో ఫ‌లితాలు విడుద‌లైన త‌రువాత 200మిలియ‌న్ టీకాల‌ను తయారు చేసే సామ‌ర్ధ్యం త‌మ‌కు ఉన్న‌ట్లు కృష్ణ తెలిపారు.