
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన చేసింది. బీహార్‌లో 32 అసెంబ్లీ సీట్లలో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బీహార్ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆదిల్ హుస్సేన్ శనివారం (అక్టోబర్ 11) కిషన్‌గంజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా అఖ్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ.. ముస్లిం ఓట్లు చీలకుండా రాష్ట్రీయ జనతాదళ్‌కి ఎంఐఎం పొత్తు ప్రతిపాదన పంపిందని.. కానీ మా ప్రతిపాదనను ఆర్జేడీ తిరస్కరించిందని తెలిపారు. దీంతో ఎంఐఎం పార్టీ మహాఘట్ బంధన్ కూటమి, ఎన్డీఏ కూటమిలో చేరకుండా.. ఎన్నికల్లో మూడో ఫ్రంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. త్వరలోనే పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
పురుషాధిక్య సమాజంలో ఎంఐఎం మహిళలకు గౌరవప్రదమైన ప్రాతినిధ్యం ఇస్తుందని.. ఇందులో భాగంగా అనేక స్థానాల్లో మహిళా అభ్యర్థులను పోటీలో నిలబెడతామని తెలిపారు. సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై పార్టీ ప్రధాన దృష్టి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లో నిర్ణయాత్మక శక్తిగా ఎదగడమే మా పార్టీ లక్ష్యమన్నారు.
►ALSO READ | ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలే: 100 మార్కుల పేపర్లో 137 మార్కులు వచ్చినయ్..!
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2025, నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ నిర్వహించునుంది ఈసీ. 2025, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. విజయం కోసం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి
ఎంఐఎం బరిలోకి దిగనున్న స్థానాలు:
- కిషన్‌గంజ్ జిల్లాలోని షన్‌గంజ్, కొచ్చాధమన్, బహదుర్‌గంజ్, ఠాకూర్‌గంజ్
- పూర్నియా జిల్లాలో అమూర్, బైసి, కస్బా
- కతిహార్ జిల్లాలో బల్రామ్‌పూర్, ప్రాణ్‌పూర్, మణిహరి, బరారీ, కద్వా
- అరారియా జిల్లాలో జోకిహాట్, అరారియా
- గయా జిల్లాలో షెర్‌ఘటి, బెలగంజ్
- తూర్పు చంపారన్ జిల్లాలో ఢాకా, నర్కతీయ
- దర్భంగా జిల్లాలో జాలే, దర్భంగా రూరల్, కేవతి, గౌర బౌరం
- భాగల్‌పూర్ జిల్లాలో నాథ్‌నగర్, భాగల్‌పూర్
- కళ్యాణ్‌పూర్ జిల్లాలో సివాన్, సమస్తిపూర్
- సీతామర్హి (బాజ్‌పట్టి)
- మధుబని (బిస్ఫీ),
- వైశాలి (మహువా)