ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలే: 100 మార్కుల పేపర్‎లో 137 మార్కులు వచ్చినయ్..!

ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలే: 100 మార్కుల పేపర్‎లో 137 మార్కులు వచ్చినయ్..!

జైపూర్: 100 మార్కులకు పరీక్ష రాస్తే.. బాగా చదివే వారికి అయితే 80, 90 మార్కులు వస్తుంటాయి. టాపర్స్‎కు అయితే.. 95 అలా.. ఎవరో ఒకరిద్దరూ 100కు 100 మార్కులు సాధిస్తుంటారు.. కానీ రాజస్థాన్‎లో మాత్రం మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 100 మార్కులకు పరీక్ష రాస్తే ఏకంగా 137, 120 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్స్ చూసి చివరకు పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఏం మాట్లాడాలో అర్ధంకాక ముక్కున వేలేసుకుంటున్నారు.

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని MBM ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ రిజల్ట్స్ చూసి విద్యార్థులు ఖంగుతిన్నారు. ఎందుకంటే.. 100 మార్కుల పేపర్‌లో చాలా మంది విద్యార్థులకు 103 నుంచి 137 వరకు మార్కులు వచ్చాయి.

ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై యూనివర్శిటీ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అనంతరం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఫలితాలను విడుదల చేసిన అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మార్కుల షీట్‌లో ఒక విద్యార్థికి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో 100కి 104, మెషిన్ డ్రాయింగ్‎లో 131, ఫిజిక్స్ ల్యాబ్ 110, మెకానికల్ ల్యాబ్- 113, వర్క్‌షాప్ ప్రాక్టీస్- 124 మార్కులు వచ్చాయి. పరీక్షలు మొత్తం 800 మంది విద్యార్థులు రాయగా.. ఇందులో చాలామందికి ఇలా మార్కులు 100కు పైనే వచ్చినట్లు సమాచారం. అయితే.. తప్పు మార్కుషీట్లను అప్‌లోడ్ చేయడం ఇదే మొదటిసారి కాదని.. గతంలో కూడా ఇలా జరిగిందని యూనివర్శిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై యూనివర్శిటీ ఎగ్జామ్ కంట్రోలర్ క్లారిటీ ఇచ్చారు. ఫలితాల అప్‌లోడ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పిదం జరిగిందని పేర్కొన్నారు. సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే వెబ్ సైట్ నుంచి ఫలితాలను తొలగించామని తప్పును అంగీకరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని.. వివరణ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.