
- మెడికల్ పరిస్థితి ఇద్దరిదీ సరిగ్గానే ఉన్నది
- ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడి
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం నివేదికపై స్పందన
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో కూలిపోయిన ప్లేన్‌లో ఎలాంటి సాంకేతిక లోపం కనిపించలేదని ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విమానం లేదా దాని ఇంజిన్లలో ఎలాంటి యాంత్రిక, నిర్వహణ సమస్యలు లేవని తేలిందని చెప్పారు. ప్రయాణానికి ముందు ఇద్దరు పైలట్లు బ్రీత్అనలైజర్ టెస్టులు పాసయ్యారని తెలిపారు. సోమవారం ఆ సంస్థలో జరిగిన కార్యక్రమంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌పై క్యాంప్బెల్స్పందించారు. ‘‘విమాన నిర్వహణకు సంబంధించిన తప్పనిసరి టాస్క్‌లన్నీ పూర్తిచేశాం. ఫ్యూయెల్ క్వాలిటీలో లోపం లేదు. టేకాఫ్ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవు” అని పేర్కొన్నారు. పైలట్ల మెడికల్పరిస్థితికి సంబంధించి ఏఏఐబీ ఎలాంటి లోపాలను ఎత్తిచూపలేదని చెప్పారు. అధికారుల సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని, ఏఏఐబీ ప్రిలిమినరీ రిపోర్ట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదం జరిగిన కొన్ని రోజుల్లోనే తమ మొత్తం 787 డ్రీమ్‌లైనర్ విమానాలను తనిఖీ చేశామని, అన్ని విమానాలు సేవలకు అనుకూలంగా ఉన్నాయని తేలిందని చెప్పారు.
ప్రిలిమినరీ రిపోర్ట్‌లో కీలక విషయాలు
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 విమానం గత నెల 12న టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిన సంగతి తెలిసిందే . అందులో ఒక్కరు మినహా ప్రయాణికులు, సిబ్బంది కలిపి 241 మంది మృతిచెందారు. వారితోపాటు విమానం ఓ వైద్యకళాశాల హాస్టల్‌పై కూలిపోవడంతో 29 మంది మరణించారు. దీనిపై గతవారం ఏఏఐబీ 15 పేజీలతో రూపొందించిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెకను వ్యవధిలోనే ఇంజిన్ల ఫ్యుయెల్ కంట్రోల్స్విచ్లు నిలిచిపోవడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసింది. అయితే, ఇది ఎలా జరిగిందో నివేదికలో స్పష్టం చేయలేదు. ప్రమాదం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కన్పించలేదని రిపోర్ట్ పేర్కొన్నది. కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్ ప్రకారం.. ఒక పైలట్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారని అడిగాడని, మరొక పైలట్ తాను అలా చేయలేదని బదులిచ్చాడని వెల్లడించింది.
ఇంధన స్విచ్‌ల కండీషన్ బాగుంది
ఇంధన స్విచ్‌ల వైఫల్యం వల్లే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన జరిగిందని ఏఏఐబీ తన ప్రిలిమినరీ రిపోర్ట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. విమానంలోని ఇంజిన్ల ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ మోడ్‌లోకి మారడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. అయితే, క్రాష్ అయిన బోయింగ్ 787 విమానంలో ఇంజిన్ ఫ్యూయెల్ స్విచ్‌లు పూర్తిగా కండీషన్లోనే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ), బోయింగ్ కంపెనీ పేర్కొన్నాయి. ఈ విమానంలో కాక్‌పిట్ మాడ్యూల్‌ను ఎయిర్ ఇండియా 2 సార్లు మార్చినట్లు తెలిపాయి. బోయింగ్ మెయింటెనెన్స్ ప్లానింగ్ డాక్యుమెంట్(ఎంపీడీ) ప్రకారం.. ప్రతి 24 వేల విమాన గంటలకు యూనిట్‌ను మార్చాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం లండన్‌కు వెళ్లే డ్రీమ్‌లైనర్ థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ (టీసీఎం)ను
2019, 2023లో రీప్లేస్ చేసినట్టు పేర్కొన్నాయి.