Air India: అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత పార్టీ చేసుకుంటారా..? నలుగురు సీనియర్ ఆఫీసర్ల సస్సెండ్

Air India: అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత పార్టీ చేసుకుంటారా..?  నలుగురు సీనియర్ ఆఫీసర్ల సస్సెండ్

ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారత చరిత్రలో ఇప్పటి వరకు అంత పెద్ద ప్లేన్ క్రాష్ జరగలేదు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన AI 171  విమానం.. కొద్ది సెకన్లకే రన్ వేకు ఎదురుగా ఉన్న మెడికో హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో 275 మంది దుర్మరణం చెందారు. ఇంత పెద్ద ఘటన జరిగి దేశం అంతా దిగ్భ్రాంతిలో ఉండగా.. ప్రపంచం అంతా సానుభూతి ప్రకటిస్తున్న సందర్భంలో.. ఎయిర్ ఇండియాలో కొందరు ఉద్యోగులు మాత్రం.. ఆ ఘటన పట్ల ఎలాంటి ఆందోళన లేకుండా పార్టీ చేసుకోవడం వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఉద్యోగులు ఆఫీసులో పార్టీ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా ఎయిర్ ఇండియా ప్రమాదం ఘటన తర్వాతి రోజు కావడం మరింత విమర్శలకు దారి తీసింది. ప్రపంచమంతా ఆవేదనలో ఉన్న సందర్భంలో బాధ్యతా రాహిత్యంగా, ఎలాంటి సానుభూతి లేకుండా ప్రవర్తించడంపై సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పార్టీలో పాల్గొన్న సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. అందులో భాగంగా పార్టీని ఏర్పాటు చేసి, గ్యాదరింగ్ కు సపోర్ట్ చేసిన నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ను సస్పెండ్ చేసింది. 

AISATS (ఎయిర్ ఇండియా) సంస్థకు చెందిన ఉద్యోగులు, సింగపూర్ SATS Ltd ఉద్యోగులు కలిసి ఆఫీస్ లో సెలబ్రేట్ చేసుకోవడం ఇటీవల వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయ్యిందనే అంశంపై కంపెనీ స్పందించలేదు. 2025, జూన్ 12న ప్లేన్ క్రాష్ అయిన ఒకటి రెండు రోజుల తర్వాత ఈ పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై AISATS శుక్రవారం (జూన్ 27) స్టేట్ మెంట్ విడుదల చేసింది. ‘‘విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు మేము సానుభూతి తెలియజేస్తున్నాం. సంస్థ వారికి అండగా ఉంటుంది. ఉద్యోగులు ఇలాంటి పార్టీలు చేసుకోవడంపై చింతిస్తున్నాం. అలాంటి ప్రవర్తన తమ సంస్థ విలువలకు వ్యతిరేకం. బాధితుల పట్ల సానుభూతి లేకపోవడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని ఎప్పటికీ అంగీకరించం. అలాంటి ఉద్యోగులను సంస్థ నుంచి తొలగిస్తున్నాం’’ అని సంస్థ తెలిపింది. సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడంలో ప్రత్యక్ష పాత్ర ఉన్న నలుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ను సంస్థ తొలగించింది.