పది​ సిగరెట్లు తాగినంత లెక్క

పది​ సిగరెట్లు తాగినంత లెక్క

సిటీ కాలుష్యాన్ని పీలిస్తే అంతే మరి.. తేల్చిన సైంటిస్టులు

మీకో రెండు ప్రశ్నలు.. సిగరెట్​ తాగుతరా? సిటీలో ఉంటున్నరా? ఇవేం పిచ్చి ప్రశ్నలు అని గుస్స కాకుర్రి. ఆ రెండింటికీ లింకుంది. సిటీల్లో ఉండేటోళ్లు ఎక్కువగా కాలుష్యానికి ఎఫెక్ట్​ అవుతుంటరు కదా. అట్లాంటోళ్లకు సిగరెట్​ అలవాటు లేకపోయినా రోజూ ప్యాకెట్​ సిగరెట్లు కాల్చినట్టు లెక్కేనట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్​ సైంటిస్టులు తేల్చి చెబుతున్న మాటిది. సిటీ కాలుష్యంలో ఎక్కువగా ఓజోన్​ పరమాణువులు ఉంటున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. దాని వల్ల కాలుష్యం బారిన పడుతున్న జనాల్లో రోజూ ప్యాకెట్​ సిగరెట్లు​ తాగడం వల్ల వచ్చే ‘ఎంఫీసెమా’ అనే లక్షణాలు కనపడుతున్నాయట.

ఎంఫీసెమా అంటే.. ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు దెబ్బతిని ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు వస్తాయని సైంటిస్టులు అంటున్నారు. దానితో చావు ముప్పు కూడా ఎక్కువే ఉంటుందంటున్నారు. ప్రస్తుతం చాలా నగరాల్లోని సిగరెట్​ అలవాటు లేని వారిలోనూ ఎంఫీసెమా లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. 3 పార్ట్స్​పర్​ బిలియన్​ (పీపీబీ) కన్నా ఓజోన్​ ఎక్కువగా ఉంటే ఎంఫీసెమా ముప్పు ఎక్కువన్నారు. అమెరికాలోని షికాగో, విన్​స్టన్​–సేలం, బాల్టిమోర్​, లాస్​ ఏంజిలిస్​, సెయింట్​ పాల్​, న్యూయార్క్​ నగరాలపై స్టడీ చేసి ఈ విషయం తేల్చారు. ఆ ఆరు నగరాల్లోనూ ఓజోన్​ స్థాయిలు సగటున 10–25 పీపీబీలున్నట్టు తేల్చారు.