ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ

న్యూఢిల్లీ: గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్‌‌లో పంట వ్యర్థాలను  కాలుస్తుండటంతో రోజురోజుకూ ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నది. బుధవారం ‘వెరీ పూర్’ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఉన్నది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని నరేలాలో అత్యధికంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 571గా నమోదైంది. ప్రస్తుతం నార్త్ ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడ దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ 400 పైనే ఏక్యూఐ ఉంది. మొత్తంగా ఢిల్లీలో 354గా ఉంది. దీంతో గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలను, కూల్చివేతలను నిలిపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల పని కోల్పోయిన కార్మికులకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. 

ఇంటి నుంచే పని చేయండి: గోపాల్ రాయ్

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఎక్కడికైనా వెళ్లాలంటే కార్ పూలింగ్ లేదా షేరింగ్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు. వాహనాల పొగ వల్లే ఢిల్లీలో 51 శాతం గాలి కలుషితమవుతోందని చెప్పారు. చలి కాచుకునేందుకు బొగ్గు లేదా ఇతర వంట చెరుకును ఉపయోగించొద్దని, ఎలక్ట్రిక్ హీటర్లను ఉపయోగించాలని, ఇండ్లు, ఆఫీసులకు సెక్యూరిటీగా ఉండే వాళ్లకు హీటర్లను ఇవ్వాలని సూచించారు. పటాకులు కాల్చడాన్ని కూడా అవైడ్ చేయాలని కోరారు. ఎవరైనా తమ ఉత్తర్వులను కాదని నిర్మాణ పనులను చేస్తుంటే ఫొటో తీసి ‘గ్రీన్ ఢిల్లీ’ ప్లాట్‌‌ఫామ్‌‌లో అప్‌‌లోడ్ చేయాలని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. పొల్యూషన్ హాట్‌‌స్పాట్‌‌లు నరేలా, ఆనంద్ విహార్, ముండ్కా, ద్వారక, పంజాబీ బాగ్ తదితర 13 ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ 
నిర్వహిస్తామని తెలిపారు.

కట్టుడు, కూల్చుడు బంద్

గాలి కాలుష్యం ప్రమాదకరంగా మారుతుండటంతో నిర్మాణరంగ పనులన్నింటినీ నిలిపేయాలని ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎక్కడా కూల్చివేత పనులు చేపట్టొద్దని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఈ నిషేధం ఉంటుందని చెప్పింది. కన్‌‌స్ట్రక్షన్స్‌‌ పనులు నిలిపేసిన నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయిన కూలీలకు నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. నిర్మాణ రంగ పనులు మొదలయ్యే దాకా ఈ సాయం చేస్తామని సీఎం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణ రంగంలోని 10 లక్షల మంది రిజిస్టర్డ్ కూలీలకు లబ్ధి కలగనుంది.  నేరుగా కూలీల ఖాతాల్లోకి డబ్బులు పడనున్నాయి. ఇందుకోసం ప్రతినెల రూ.500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కిందటేడాది కూడా ఇలానే 7 లక్షల మంది కూలీలకు సాయం చేసింది. 

కాలుష్యం తగ్గేదాకా స్కూళ్లు బంద్ పెట్టండి..

కాలుష్యం తగ్గేదాకా స్కూళ్లను మూసేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌‌సీపీసీఆర్) కోరింది. తీవ్రంగా ఉన్న కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీ సీఎస్‌‌కు ఎన్‌‌సీపీసీఆర్ చైర్‌‌‌‌పర్సన్ ప్రియాంక్ కనూంగో లేఖ రాశారు.

ఎంత ఉంటే సేఫ్..

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 100 దాకా ఉంటే.. అక్కడ మంచి గాలి ఉన్నట్లు లెక్క. అదే ఏక్యూఐ 100 నుంచి 200గా ఉంటే మోస్తరుగా ఉన్నట్లు భావిస్తారు. ఆ స్థాయిని మించితేనే సమస్య. సంఖ్య పెరిగే కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంటుంది. 200 నుంచి 300 ఉంటే ‘పూర్’.. 300 నుంచి 400 ఉంటే ‘వెరీ పూర్’.. 400 నుంచి 500 ఉంటే ‘సివియర్’ కింద లెక్క.

‘రెడ్​ లైట్ ఆన్​​..’కు ఎల్జీ బ్రేక్​

పొల్యూషన్ కంట్రోల్ విషయంలోనూ ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం నెలకొంది. కాలుష్య నియంత్రణలో భాగం గా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్‌‌ లైట్ పడగానే ఇంజిన్లను ఆఫ్ చేయాలంటూ ప్రభుత్వం క్యాంపెయిన్ ప్రారంభించింది. ‘రెడ్ లైట్ ఆన్.. కార్ ఆఫ్’ కార్యక్రమం అమలుకు పర్మిషన్ ఇవ్వాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫైల్ పంపింది. అయితే, ఇందులో ఎలాంటి లాజిక్ లేదని ఎల్జీ ఆ ఫైల్‌‌ను తిప్పిపంపారు. ఈ విధంగా గాలి కాలుష్యాన్ని కంట్రోల్‌‌ చేయొచ్చనే దానికి ఎలాంటి ఆధారమూలేదన్నారు. దీంతో సక్సేనా ఇంటి వద్ద నిరసనలు తెలిపిన ఆప్.. ‘‘ఛాపాస్ (వార్తల్లో ఉండాలని అనుకోవడం) అనే అనారోగ్యం ఎల్జీకి ఉంది”అని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు.