విమానంలో నిలబడి ప్రయాణం!

విమానంలో నిలబడి ప్రయాణం!

ఊర్లో ఒక్కటే బస్సు. పొద్దున్నే అదే రావాలి.. మళ్లీ సాయంత్రం అదే తెచ్చి వదలాలి. బస్సొచ్చే టైంకు జనం మస్తుగా వస్తరు. సీట్లు గురించి ఆలోచించే వాళ్లే ఉండరు! ఎందుకంటే ఖాళీ ఉండదని తెలుసు కాబట్టి. ఏం చేస్తం.. ఓ గంట నిలబడితే ఇల్లు చేరతం అనుకుంటరు.  ఇట్లాంటి ప్రయాణం విమానాల్లో ఉంటే ఎట్లా ఉంటదో ఓ సారి ఊహించుకోండి! ఆ ఊహే తేడాగా ఉంది కదూ. అయినా కూడా స్టాండింగ్​ జర్నీని తేబోతోంది ఓ ఎయిర్​లైన్​ సంస్థ.  ఆదాయాన్ని పెంచుకునేందుకు విమానాల్లో స్టాండింగ్ సీట్లను తేబోతున్నాయి! ఇటీవల జర్మనీలోని హాంబర్గ్​లో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ ఎక్స్​పోలో స్కై రైడర్ 2.0 పేరుతో ఏవియో ఇంటీరియర్స్ అనే సంస్థ స్టాండింగ్ సీట్లను ప్రదర్శించింది.

ఈ ఏడాది కొత్త వెర్షన్ అంటే స్కై రైడర్ 3.0 సీట్లను ఆవిష్కరించబోతోంది. ఇవి ఎలా ఉంటాయో ఒక్కసారి ఫొటోను చూస్తే అర్థమైపోతుంది. ఈ సీట్లతో విమానాల్లో ‘అల్ట్రా బేసిక్ ఎకానమీ’ అనే క్లాస్ ను ఏర్పాటు చేయొచ్చనేది ఏవియో ఇంటీరియర్స్ ఆలోచన. వీటిని వాడటం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులకు అతి తక్కువ రేట్లకే టిక్కెట్లు అమ్మొచ్చని చెబుతోంది. ‘‘ఈ సీట్లలో కూర్చుంటే గుర్రంపై ఎక్కినట్లు ఉంటుంది. తక్కువ దూరం ప్రయాణాలకు పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండదు’’ అని పేర్కొంది. ఏవియో ఇంటీరియర్స్ ఆలోచనపై నెటిజన్లు భగ్గుమన్నారు. మనుషులను మనుషుల్లా చూడటం మానేసి, ఏదో వస్తువులా అక్కడ కుక్కొచ్చు, ఇక్కడ కుక్కొచ్చు అని చెబుతున్నారంటూ ఘాటుగా స్పందించారు. అసలు విమానంలో సీట్లు లేకుండా చేసి, ప్రయాణికులను సరుకుల్లా బాక్సుల్లో పెడితే మరింత మందిని పట్టించొచ్చంటూ జోకులు పేల్చారు.