జంతు ప్రేమికులు.. పోయిన పిల్లల ప్రాణాలు తెచ్చివ్వగలరా..? సుప్రీం కోర్ట్ ఫైర్

 జంతు ప్రేమికులు.. పోయిన పిల్లల ప్రాణాలు తెచ్చివ్వగలరా..? సుప్రీం కోర్ట్ ఫైర్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క వీధి కుక్క కూడా కనిపించడానికి వీల్లేదని.. వాటిని షెల్టర్స్​కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వీధి కుక్కల కారణంగా జనం రోడ్లమీదికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఇది చాలా ఆందోళనకర పరిణామమని పేర్కొంది. రేబిస్​ బారిన పడి పిల్లలు చనిపోతుంటే గుండె తరుక్కుపోతున్నదని, వీధి కుక్కల తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని జంతుప్రేమికులను, సంస్థలను హెచ్చరించింది.

ఇటీవల ఢిల్లీలో కుక్కకాటు బారినపడి చిన్నారులు చనిపోతున్న ఘటనలను జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్​ ఆర్​ మహదేవన్​తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్​ సుమోటోగా స్వీకరించింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. ‘‘దేశ రాజధాని వీధుల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.  స్ట్రీట్​ డాగ్స్​ వల్ల జనం బయటికి రావాలంటేనే వణికిపోతున్నరు. జనం మీద కుక్కలు ఎగబడుతున్న వీడియోలు చూస్తుంటే భయమేస్తున్నది. రేబిస్​ బారిన పడ్డ పిల్లల బాధ, వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటి?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 

పిల్లల ప్రాణాలను వాళ్లు తిరిగి తెస్తరా? 

వీధి కుక్కల షెల్టర్స్‎కు తరలించేందుకు ఢిల్లీకి దూరంలో ఓ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారని, అయితే.. జంతు హక్కుల కార్యకర్తలు కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్​ తెచ్చుకుంటున్నారని సొలిసిటర్​​ జనరల్ తుషార్​ మెహతా బెంచ్​ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కల్పించుకున్న ధర్మాసనం..  ‘‘వీధి కుక్కల తరలింపును అడ్డుకునేవాళ్లు.. ఆ కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల ప్రాణాలు తెచ్చివ్వగలరా? కొందరు జంతు ప్రేమికుల కోసం మన పిల్లల ప్రాణాలు త్యాగం చేయలేం. రేబిస్​ బారినపడ్డ పిల్లల పరిస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతున్నది. వీధి కుక్కల తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించింది.

ఢిల్లీ, ఎన్​సీఆర్​ వీధుల నుంచి వీధికుక్కలను తరలించాలని, ఎనిమిది వారాల్లో ఒక్క కుక్క కూడా వీధుల్లో కనిపించడానికి వీల్లేదని అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమో తీసుకుంటున్న నిర్ణయం కాదని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ ఆర్డర్​ జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం కూడా కుదరదని తేల్చిచెప్పింది. ఢిల్లీ వీధుల్లో పిల్లలు సైకిళ్లు తొక్కుకుంటూ, కలిసి ఆడుకుంటూ హాయిగా గడిపే పరిస్థితులు రావాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

సుప్రీం ఆదేశాలు అశాస్త్రీయం: పెటా

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌‌సీఆర్ పరిధిలోని వీధి కుక్కలన్నింటిని తక్షణమే షెల్టర్లకు తరలించాలని.. ఈ చర్యలను ఏ సంస్థలైనా అడ్డుకోవడానికి  ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలపై పెటా తీవ్రంగా స్పందించింది. ఈ ఆదేశాలు అశాస్త్రీయమైనవని పేర్కొంది. ఈ సందర్భంగా పెటా ఇండియా సీనియర్ డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ అఫైర్స్ డాక్టర్ మినీ అరవిందన్ మాట్లాడుతూ.. కుక్కలను నిర్బంధించడం అశాస్త్రీయమని, ఇది ఎప్పుడూ విజయవంతం కాలేదని అన్నారు. 

2022–-23 సర్వే ప్రకారం.. ఢిల్లీలో సుమారు 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వాటిలో సగానికి పైగా స్టెరిలైజ్ చేయలేదని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కుక్కలను ఒక్కసారిగా షెల్టర్లకు తరలించడం వల్ల వాటి సంఖ్య తగ్గదని, రేబీస్ నివారణ కూడా కాదని ఆయన స్పష్టం చేశారు. స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్‌‌లు సరిగ్గా అమలు చేయకపోవడమే సమస్యకు మూలకారణమని ఆయన విమర్శించారు. అక్రమ పెట్ షాప్‌‌లు, బ్రీడర్లను మూసివేయడం, అడాప్షన్‌‌ను ప్రోత్సహించడం వంటి చర్యలు సమస్యకు పరిష్కారాలని ఆయన సూచించారు. 2001లో ప్రభుత్వం జారీ చేసిన స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ నిబంధనలను సరిగ్గా అమలు చేస్తే పరిస్థితి కొంత మెరుగవుతుందని ఆయన తెలిపారు.