సింగరేణిలో కొత్త గనుల సాధనకు సమ్మె : మేకల దాసు 

సింగరేణిలో కొత్త గనుల సాధనకు సమ్మె : మేకల దాసు 

కోల్​బెల్ట్, వెలుగు: పలు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు సక్సెస్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ మేకల దాసు పిలుపునిచ్చారు. ఆదివారం మందమర్రిలోని సింగరేణి సీఈఆర్​క్లబ్​లో ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రెసిడెంట్​ఎండీ అక్బర్​అలీతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనుల సాధనతో పాటు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను తిరిగి అమలు చేసేలా సమ్మె ద్వారా ఒత్తిడి తేవాలన్నారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్​అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 20న కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు తమ యూనియన్​సంపూర్ణ మద్దతిస్తోందన్నారు. అసంఘటితరంగ కార్మిక వర్గానికి పని భద్రత, సమాన పనికి సమాన వేతనాలు లేవని, స్కీల్డ్​వర్కర్లు చాలీచాలని జీతాలతో శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ సర్కార్​ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సలెంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శనం, దాగం మల్లేశ్, ఇప్పకాయల లింగయ్య, బాజీసైదా,  పౌలు, ముస్కే సమ్మయ్య, కలిందర్ అలీ ఖాన్, తోకల సరస్వతి, దేనబోయిన బాపు, జాడి పోషం, శంకర్  తదితరులు పాల్గొన్నారు.