సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచినా దక్కని గుర్తింపు..

సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచినా దక్కని గుర్తింపు..

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి ఎన్నికలు జరిగి రెండు నెలలు గడిచినా గెలిచిన సంఘాలకు ఇంతవరకూ అధికారిక 'గుర్తింపు' దక్కలేదు. గెలిచిన 15 రోజుల్లోనే సర్టిఫికెట్ అందించాల్సి ఉన్నా ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సమస్యలపై చర్చించి, వాటిని పరిష్కరించేందుకు వివిధ స్థాయిల్లో జరగాల్సిన మీటింగ్ లకు మోక్షం కలగడం లేదు. 

ఉత్కంఠ పోరులో ఏఐటీయూసీ విజయం

సింగరేణిలో గతేడాది 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. సింగరేణిలో మొత్తం 11 డివిజన్లు ఉండగా ఏ యూనియన్​కు ఎక్కువ ఓట్లు వస్తే ఆ యూనియన్​కు గుర్తింపు హోదా లభిస్తుంది. ఈ క్రమంలో బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, ఆర్జీ 1, ఆర్జీ 2 ఏరియాల్లో ఏఐటీయూసీ గెలవగా, ఈ సంఘానికి 16,177 ఓట్లు వచ్చాయి. అలాగే ఆర్జీ 3 ఏరియా, భూపాలపల్లి, కొత్తగూడెం, కొత్తగూడెం కార్పొరేట్, ఇల్లందు, మణుగూర్​ఏరియాల్లో ఐఎన్ టీయూసీ (సింగరేణి కోల్​మైన్స్​లేబర్​యూనియన్) గెలిచింది. ఐఎన్ టీయూసీ ఆరు ఏరియాల్లో గెలిచినప్పటికీ ఓట్లు మాత్రం 14,178 మాత్రమే వచ్చాయి. దీంతో ఎక్కువ ఓట్లు సాధించిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా నిలువగా, ఐఎన్ టీయూసీ మాత్రం ప్రాతినిధ్య సంఘానికే పరిమితం అయింది.

మీటింగ్ లు జరగుతలే..సమస్యలు పరిష్కారమైతలే..

సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన ఏ యూనియన్​కైనా 15 రోజుల్లోనే సెంట్రల్ లేబర్ కమిషనర్ నుంచి గానీ, సింగరేణి మేనేజ్ మెంట్ నుంచి గానీ అధికారికంగా సర్టిఫికెట్ అందజేయాలి. ఆ తర్వాత సీఎండీ, డైరెక్టర్​స్థాయిలో స్ట్రక్చర్డ్, జాయింట్ కన్సల్టెంట్​కమిటీ (జేసీసీ) నిర్వహిస్తారు. ఈ మీటింగ్ లలో సింగరేణి స్థాయిలో నెలకొన్న సమస్యలను యూనియన్​ప్రతినిధులు మేనేజ్​మెంట్​దృష్టికి తీసుకెళ్తారు. అలాగే ఏరియా లెవల్​లో కూడా గుర్తింపు సంఘంతో పాటు ఆయా ఏరియాల్లో మాత్రమే గెలిచిన ప్రాతినిధ్య సంఘంతో జనరల్​మేనేజర్​స్థాయిలో ప్రతి నెలా మీటింగ్​లు నిర్వహిస్తారు. మైన్​ లెవల్​లో సేప్టీ కమిటీ, మైన్స్​కమిటీ మీటింగ్​లు నిర్వహించి కార్మికులు ఫీల్డ్​లెవల్​లో ఎదుర్కొంటున్న సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తారు. కానీ ఎన్నికలు జరిగి రెండు నెలలు గడిచినా అధికారిక గుర్తింపు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా జరగలేదు.

నెరవేరని కార్మికుల ఆశలు

సింగరేణిలో గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్​ఎస్​సర్కార్​కు అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హవానే నడిచింది. ఆ పార్టీపై, యూనియన్​పై ఉన్న వ్యతిరేకతతో కార్మికులు తర్వాత ఏఐటీయూసీకి, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్​టీయూసీకి పట్టం కట్టారు. ఈ రెండు యూనియన్లు తమ సమస్యలను పరిష్కరిస్తాయని కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ముఖ్యంగా కొత్త అండర్​గ్రౌండ్​ మైన్ల ఏర్పాటు ద్వారా మరిన్ని ఉద్యోగావకాశాలు వస్తాయని, తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్​లు సింగరేణికే దక్కేలా చేయడం, ప్రతి కార్మికుడికి సొంతింటి నిర్మాణం కోసం 250 గజాల స్థలం కేటాయింపు, కోల్​ఇండియా మాదిరిగా సింగరేణిలో కల్పిస్తున్న సౌకర్యాల (పెర్క్స్​)పై విధిస్తున్న ఇన్​కమ్​ట్యాక్స్​ను తిరిగి కార్మికులకు చెల్లించడం, కార్మికులు, వారి కుటుంబాలకు సూపర్​స్పెషాలిటీ వైద్యం అందించడం, పాత క్వార్టర్లను కూల్చివేసి ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా నిర్మించడం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశపడ్డారు. కానీ రెండు నెలలు గడిచినా ఏ ఒక్క మీటింగ్​జరగకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు అధికారిక సర్టిఫికెట్లు అందజేసి, మీటింగ్లు నిర్వహించాలని కార్మికులు కోరుతున్నారు.