
- ఇంగ్లండ్‌లో పిచ్‌తోపాటు వాతావరణంపైనా కన్నేసి ఉంచాలి
- టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె
అరుండెల్ (ఇంగ్లండ్): దాదాపు 18 నెలల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానె ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్‌కు కీలకం కానున్నడు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున అనూహ్యంగా చెలరేగిన అజింక్యా.. గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ ప్లేస్‌లో నేషనల్ టీమ్‌లో ప్లేస్ దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో ఆట చూసి టెస్టు టీమ్‌లోకి ఎలా తీసుకుంటారన్న విమర్శలు వచ్చాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ నెల7 నుంచి జరిగే మ్యాచ్‌పై రహానె ఫోకస్ పెట్టాడు. ఇంతకాలం టీమ్‌కు దూరమైనందుకు ఎలాంటి బాధ లేదని, గతాన్ని అస్సలు పట్టించుకోనని అంటున్నాడు. ఐపీఎల్‌లో ఆడిన జోరును ఈ మెగా ఫైనల్లోనూ కొనసాగిస్తానని చెబుతున్నాడు.
‘18–19 నెలల తర్వాత టీమ్‌లోకి తిరిగొస్తున్నా. మంచో.. చెడో ఏది జరిగినా నా గతం గురించి ఆలోచించడం ఇష్టం లేదు. నా జర్నీ కొత్తగా ప్రారంభించాలని అనుకున్నా. ఎప్పట్లాగే నా పనిని కొనసాగిస్తా. పర్సనల్‌గా ఐపీఎల్‌లో సీఎస్కేకు ఆడటాన్ని ఎంజాయ్ చేశా.సీజన్ అంతా బాగా బ్యాటింగ్ చేశా. లీగ్‌కు ముందు కూడా నా బ్యాటింగ్ బాగానే ఉంది. డొమెస్టిక్ సీజన్‌లో బాగా ఆడినందుకు సంతృప్తిగా ఉన్నా. కాబట్టి టీమిండియాలోకి తిరిగి రావడం నాకు కొంత భావోద్వేగాన్ని కలిగించింది’ అని ఆసీస్‌తో ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న రహానె బీసీసీఐ టీవీతో చెప్పాడు.
సీఎస్కే ఐదో టైటిల్ నెగ్గడంలో రహానె కూడా భాగం అయ్యాడు. లీగ్‌లో ఎటాకింగ్ బ్యాటింగ్, మంచి స్ట్రయిక్ రేట్‌చూపెట్టి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ముంబైపై 27 బాల్స్‌లోనే 61 రన్స్ చేయడం అతని దూకుడుకు నిదర్శనం. ‘ఐపీఎల్ మాదిరిగానే, అదే మైండ్‌సెట్‌తో ఇక్కడా ఆడాలని చూస్తున్నా. టీ20లు అయినా, టెస్టు అయినా ఫార్మాట్ గురించి ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను బాగానే బ్యాటింగ్ చేస్తున్నా కాబట్టి అతిగా ఆలోచించి మున్ముందు విషయాలను క్లిష్టతరం చేయకూడదనుకుంటున్నాను. ఎంత సింపుల్‌గా ఉంటే నాకు అంత మంచిది’ అని రహానె చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమ్‌లో వాతావరణం, కల్చర్ బాగుందని, కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ జట్టును బాగా హ్యాండిల్ చేస్తున్నారని అన్నాడు. నేషనల్ టీమ్‌కు దూరంగా ఉన్న టైమ్‌లో తనకు మద్దతుగా నిలిచిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు రహానె థ్యాంక్స్ చెప్పాడు. రీఎంట్రీకి చాలా కష్టపడ్డానని, ఫిట్‌నెస్ పెంచుకొని, తిరిగి డొమెస్టిక్ క్రికెట్ ఆడానని తెలిపాడు. ఇక, ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు మైండ్‌సెట్ ముఖ్యమని, మ్యాచ్‌లో ఆయా సెషన్‌లోని పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితే ఫలితం వస్తుందని రహానె అభిప్రాయపడ్డాడు. పిచ్‌తో పాటు వాతావరణంపై కూడా ఓ కన్నేసి ఉంచాలన్నాడు.
రబ్బర్ ‘రియాక్షన్ బాల్స్’తో క్యాచింగ్ ప్రాక్టీస్
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. టెస్టు ఫార్మాట్‌లో క్యాచ్‌లు చాలా ముఖ్యమైన నేపథ్యంలో ఫీల్డింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ప్లేయర్లు ప్రత్యేకమైన రంగు రంగుల రబ్బర్ ‘రియాక్షన్ బాల్స్’తో క్యాచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యాచ్‌లో క్యాచ్‌లు అందుకునేప్పుడు చివరి క్షణాల్లో డివియేట్ అవ్వకుండా కోచింగ్ స్టాఫ్ ఇలాంటి ప్రాక్టీస్ సెషన్‌ను ఏర్పాటు చేసింది. ఇవి గల్లీ క్రికెట్‌లో ఆడే రబ్బర్ బాల్స్ కాదని, ఫీల్డింగ్ డ్రిల్స్ కోసం ప్రత్యేకంగా చేయించిన రియాక్షన్ బాల్స్ అని ఎన్‌సీఏలో పని చేసిన ఓ కోచ్ చెప్పాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లో గాలి, చల్లటి వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన క్యాచింగ్ కోసం ఇలాంటి బాల్స్‌తో ప్రాక్టీస్ చేస్తారని తెలిపాడు.