మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారంటే..

మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారంటే..

ముంబై: బారామతిలో విమాన ప్రమాద దుర్ఘటనలో చనిపోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు భార్య, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ విషాదం గురించి తెలియగానే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, శరద్ పవార్, సుప్రియా సూలే బారామతికి వెళ్లారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సీఎం పదవిలో కూర్చోవాలనే కోరిక నెరవేరకుండానే చనిపోయారు. అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ నీడలో రాజకీయంగా ఎదిగారు.

1999లో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని స్థాపించారు. రెండు దశాబ్దాలకు పైగా ఈ పార్టీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. శరద్ పవార్ సోదరుడి కొడుకు అయిన అజిత్ పవార్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉండి, పలుమార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే, 2023లో శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీ నుంచి అజిత్ పవార్ విడిపోయి.. బీజేపీ, ఏక్‌‌నాథ్ షిండే శివసేన కూటమిలో చేరారు. అనంతరం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

ఆ తర్వాత ఎన్​సీపీ రెండుగా విడిపోయింది. అజిత్ పవార్ విభాగం మహారాష్ట్రలో పాలక ఎన్‌‌డీఏ కూటమితో కలిసిపోయింది. ఎన్నికల సంఘం ఆయన వర్గాన్ని చట్టబద్ధ ఎన్‌‌సీపీగా గుర్తించి గడియారం గుర్తును కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీ (ఎస్పీ) స్వతంత్రంగా కొనసాగుతోంది. 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ విభాగం ఓడిపోయింది.