శరద్ పవార్‫కు ఆయన కోరుకున్న ఎన్నికల గుర్తే

శరద్ పవార్‫కు ఆయన కోరుకున్న ఎన్నికల గుర్తే

శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని గత ఏడాది జూలైలో అజిత్ పవార్ చీల్చారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలసి ఆయన ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. దీంతో శరద్‌పవార్‌ వర్గం తమ పార్టీ లోగో, గుర్తును అజిత్‌ పవార్‌ వర్గం వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరింది.

శరద్ పవార్ వర్గం తురాయి ఊదుతున్న వ్యక్తి గుర్తుతో మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుప్రీం కోర్టు మంగళవారం అనుమతించింది. ఆ గుర్తును శరద్‌ పవార్‌ వర్గానికి రిజర్వ్‌ చేయాలని, మరే పార్టీకి, అభ్యర్థికి కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే అజిత్‌ పవార్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అసలు గుర్తు అయిన ‘గడియారం’ గుర్తుపై పోటీ చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అజిత్‌పవార్‌ వర్గాన్ని అసలైన ఎన్‌సీపీగా గుర్తిస్తూ గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శరద్‌ పవార్‌ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై తమ తీర్పు వచ్చే వరకు తాజా ఆదేశాలు వర్తిస్తాయని న్యాయస్థానం పేర్కొంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని తమదే అసలైన ఎన్‌సీపీగా ప్రకటించాలని కోర్టును కోరింది.

కాగా,  అటు అజిల్‌ పవార్‌ వర్గం , ఎక్కువ మంది మద్దతు తమకే ఉన్నందున తమదే అసలైన ఎన్‌సీపీగా ప్రకటించాలని కోరింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం అజిత్‌ పవార్‌ వర్గాన్ని అసలైన ఎన్‌సీపీగా గుర్తిస్తూ గత నెలలో ప్రకటన చేసింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శరద్‌పవార్‌ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.