మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన "దాదా" ఇక లేరన్న వార్త యావత్ రాజకీయ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బారామతి గడ్డపైనే ఆయన ప్రయాణం ముగియడం ఒక విషాదకర పరిణామంగా నిలిచింది. ఆయన ప్రస్థానం ప్రారంభమైన చోటే అనూహ్యంగా ముగియటంతో అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు.. ఒక పవర్ కేంద్రం. జూలై 22, 1959న జన్మించిన ఆయన.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని, బలమైన పట్టును ఏర్పరచుకున్నారు. అసలు అజిత్ పవార్ ప్రయాణం మహారాష్ట్ర రాజకీయాలకు వెన్నెముక అయిన సహకార రంగంతో మొదలైంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఒక సహకార షుగర్ ఫ్యాక్టరీ బోర్డు సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో పూణే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, దాదాపు 16 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధించారు. అదే ఏడాది బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు.
రికార్డు స్థాయిలో ఉప ముఖ్యమంత్రిగా..
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అజిత్ పవార్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గత 13 ఏళ్లలో ఆయన ఏకంగా ఐదుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
* ముందుగా పృథ్వీరాజ్ చవాన్ ప్రభుత్వంలో (2010-2014) రెండుసార్లు..
* 2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి సంచలన రీతిలో ఒకసారి (కేవలం 80 గంటలు)..
* ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీలో..
* చివరగా 2023 నుండి ప్రస్తుత దేవేంద్ర ఫడ్నవీస్/ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు తృటిలో తృటిలో తప్పుకున్నప్పటికీ.. పరిపాలనలో ఆయన మాటే శాసనంగా సాగింది.
బారామతి: పవార్ సొంత కోట
అజిత్ పవార్‌కు బారామతి నియోజకవర్గంతో విడదీయలేని అనుబంధం ఉంది. 1995 నుంచి వరుసగా ఏడుసార్లు ఇక్కడ విజయం సాధించి.. ఈ ప్రాంతాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన మేనల్లుడు యుగేంద్ర పవార్‌ను ఓడించి, తన ప్రాబల్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ వంటి కీలక శాఖల మంత్రిగా చేసిన అభివృద్ధి పనులు ఆయన్ను నిరంతరం గెలిపించాయి.
అజిత్ పవార్ కఠినమైన క్రమశిక్షణ, పాలనా దక్షతకు పేరుగాంచారు. ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించడం, అధికారులను పరుగులు పెట్టించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక వ్యవహారాల్లో ఆయనకున్న పట్టు మాటల్లో చెప్పలేనిది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాజకీయాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. సహకార రంగం నుంచి మొదలై.. రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఎదిగిన అజిత్ పవార్ ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం మహారాష్ట్రకు తీరని లోటనే చెప్పుకోవాలి.
