ఎన్సీపీలో లుకలుకలు..స్టార్‌ క్యాంపైనర్ల జాబితాలో అజిత్‌ పవార్‌ పేరు తీసేశారా..?

ఎన్సీపీలో లుకలుకలు..స్టార్‌ క్యాంపైనర్ల జాబితాలో అజిత్‌ పవార్‌ పేరు తీసేశారా..?

ముంబై : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ.. ముంబై పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లో అంతర్గత విభేదాలు బయపడుతున్నాయి. గత కొంతకాలంగా ఎన్సీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌.. పార్టీకి గుడ్ బై చెప్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

శుక్రవారం (ఏప్రిల్ 21న) ముంబై నగర పాలక సంస్థ (BMS) ఎన్నికల సన్నాహాలపై శరద్‌ పవార్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ కీలక నేతలంతా హాజరయ్యారు. అజిత్ పవార్ మాత్రం హాజరుకాలేదు. ఇదే సమయంలో ఆయన పుణెలోని మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై అప్పుడే చర్చ మొదలైంది.

అజిత్ పవార్ ఎందుకు డుమ్మాకొట్టారు..? అనే దానిపై పార్టీలో జోరుగా చర్చ నడిచింది. ఈ క్రమంలో అజిత్‌ పార్టీ వీడనున్నాడని ఊహాగానాలు మళ్లీ కొనసాగుతున్నాయి. అయితే.. ముందే షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమం ఉన్నందు వల్ల ముంబై సమావేశానికి వెళ్లలేదని అజిత్‌ పవార్‌ చెప్పారు. 

ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ కు ఎన్సీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్ణాటకలో వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల స్టార్‌ క్యాంపైనర్ల జాబితా నుంచి అజిత్ పవార్ పేరును తొలగించింది. ఎన్సీపీ స్టార్‌ క్యాంపైనర్ల జాబితాలో అజిత్‌ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

జాబితాలో పార్టీ అధినేత శరద్‌ పవార్‌, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, ప్రఫుల్‌ పటేల్‌, శివాజీరావ్‌ గార్జే, క్లైడే క్రాస్టో, ఆర్‌. హరి పేర్లు ఉన్నాయి. పార్టీ కర్ణాటక అధ్యక్షుడైన హరి.. యలబుర్గా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

అజిత్‌ పవార్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముంబైలో జరిగిన పార్టీ కీలక సమావేశానికి అజిత్‌ పవార్‌ హాజరుకాకపోవడం ఈ చర్చకు మరింత ఊతమిస్తోంది. అజిత్‌ పవార్‌ను మహావికాస్‌ అఘాడీ నేతలు అవమానిస్తున్నారని, ఆయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారనే అర్థంతో బీజేపీ నేతలు అజిత్‌ పవార్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

అజిత్‌ పవార్‌ బీజేపీలో చేరబోతున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలను అయన ఖండించారు. అజిత్‌ పవార్‌ పార్టీలోనే ఉంటారని ఎన్సీపీ స్పష్టం చేసింది.