జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా ‘ఆకాశ ఎయిర్’ ​సేవలు మొదలు

జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా ‘ఆకాశ ఎయిర్’ ​సేవలు మొదలు

న్యూఢిల్లీ: కొత్త ఎయిర్​లైన్​ కంపెనీ ‘ఆకాశ ఎయిర్’ ​సేవలు మొదలయ్యాయి. ముంబై – అహ్మదాబాద్ మార్గం మధ్య ఆదివారం మొదటి విమానం టేకాఫ్ అయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా దీనిని ప్రారంభించారు.  ఆకాశ ఎయిర్ శుక్రవారం అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై,  కొచ్చి రూట్లలో ప్రయాణాల కోసం టిక్కెట్ బుకింగ్‌‌‌‌లను ప్రారంభించింది. ఈ నెల 13 నుండి బెంగళూరు  కొచ్చి మధ్య అదనంగా 28  విమానాలను నడపడం ప్రారంభిస్తుంది. ఎట్టకేలకు తమ విమాన సర్వీస్‌లను మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని, నమ్మదగిన నెట్‌‌‌‌వర్క్,  సరసమైన ఛార్జీలతో కస్టమర్లకు సేవలు అందిస్తామని ఆకాశ ఎయిర్ ఫౌండర్​,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే చెప్పారు.

ప్రముఖ పెట్టుబడిదారు రాకేష్ జున్‌‌‌‌జున్‌‌‌‌వాలా మద్దతు గల ఆకాశ ఎయిర్​ డైరెక్టరల్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ నుంచి పోయిన నెలలో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ పొందింది. ఆకాశ ఎయిర్  మ్యాక్స్​ విమానం బోయింగ్ స్కై ఇంటీరియర్  ఎల్​ఈడీ లైటింగ్‌‌‌‌తో వస్తుంది. మొదటి 19 విమానాల్లో 189 చొప్పున సీట్లు ఉంటాయి. ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌‌‌లో ప్రతి సీటుకు యూఎస్​బీ పోర్ట్ ఉంటుంది. ఎయిర్‌‌‌‌లైన్ ఇన్‌‌‌‌ఫ్లైట్ వైఫై లేనప్పటికీ,  విస్తారా,  స్పైస్‌‌‌‌జెట్ మాదిరిగానే త్వరలో స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించనుంది.   ఇన్‌‌‌‌ఫ్లైట్ క్యాటరింగ్ సర్వీస్‌‌‌‌ ఉంటుంది. మెనులో శాండ్‌‌‌‌విచ్‌‌‌‌లు, క్రోసెంట్‌‌‌‌లు, టార్ట్‌‌‌‌లు, రోల్స్,  బర్గర్లు, పూరి, ఉప్మా వంటివి ఉన్నాయి.