
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) తనయుడు ఆకాశ్ జగన్నాథ్(Akash Jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న ఆకాష్ పూరీ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. కొత్త దర్శకుడు కాశీ పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి “తల్వార్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
సోమవారం (ఆగస్ట్ 19) గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాను వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, RX 100 ఫేమ్ హీరో కార్తికేయ స్క్రిప్ట్ అందించారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘తల్వార్’...ఈ టైటిల్ పవర్ఫుల్ గా ఉంది. దీనికి తగినట్లుగానే ఈ కథలో మాస్, యాక్షన్ అంశాలు మేళవించారని తెలుస్తోంది. కొలకతా బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని, ఓ సామాజిక అంశాన్ని ఈ కథలో స్పృషిస్తున్నామని మేకర్స్ చెప్తున్నారు.
ఈ సినిమాకు కేశవ కిరణ్ బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని అందించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్‌ను అతి త్వరలోనే అనౌన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే..ఆకాష్ పూరీ ఇటీవలే తన పేరును మార్చుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.ఇక నుంచి తనను ఆకాశ్ జగన్నాథ్ అని పిలవాలంటూ కోరారు.