
ముథోల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ముథోల్ నియోజకవర్గం బీజేపీ నాయకులు మోహన్ రావు పటేల్ పిలుపునిచ్చారు. గురువారం ముథోల్ మండలంలోని ముద్గల్ గ్రామంలో పల్లె పల్లెకు బీజేపీ గడప గడపకు మోహన్ రావు అనే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి బీజేపీ జెండాను ఆవిష్క రించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుపేదలకు పక్కా గృహాలతో పాటు దళితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముథోల్ మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.