టెలికాం పరిశ్రమ ఆర్థికంగా మరింత బలపడాలి: అఖిల్ గుప్తా

టెలికాం పరిశ్రమ ఆర్థికంగా మరింత బలపడాలి: అఖిల్ గుప్తా
  • భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ వైస్ చైర్మన్ గుప్తా

న్యూఢిల్లీ: దేశమంతటా డిజిటల్ కనెక్టివిటీ కల నెరవేరాలంటే టెలికాం పరిశ్రమ ఆర్థికంగా మరింత బలపడాలని భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ వైస్ చైర్మన్ అఖిల్ గుప్తా అన్నారు. మూలధనంపై చాలా తక్కువ రాబడి కారణంగా టెలికాం ఇండస్ట్రీ ఎదగడం లేదని, ఇది పెరగకపోతే తీవ్రనష్టాలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా డిజిటల్ ఫెస్ట్‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ పోటీ వల్ల.. ఒక్కో కస్టమర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ)ను పెంచడం కష్టంగా ఉందని,  రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏఆర్పీయూ దశలవారీగా రూ. 300కి చేరుకునేలా అన్ని కంపెనీలూ కలిసి పని చేయాలని సూచించారు. మూలధనంపై తగిన రాబడి లేకపోవడం వల్లే, ఇప్పుడు ఒక పెద్ద టెల్కో ఇబ్బందులు పడుతోందంటూ వోడాఫోన్ ఐడియా  పేరును ప్రస్తావించకుండా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ రంగంలో భారతీ ఎయిర్‌‌‌‌టెల్  రిలయన్స్ జియో రెండు ప్రధాన కంపెనీలు. పోటీ కారణంగానే టారిఫ్‌‌‌‌లను పెంచడం లేదని ఆయన అన్నారు.

"నేను టారిఫ్‌‌‌‌ల గురించి ఆందోళన చెందడం లేదు. మనం చూడవలసింది ఏఆర్పీయూల పెరుగుదల. మొత్తం ఆదాయం పెరగాలి. ప్రతి జీబీకి ధర తగ్గినా సమస్య కాదు. కానీ మొత్తం ఆదాయాలు పెరగాలి. రాబోయే కొన్నేళ్లలో ఏఆర్పీయూలు దశలవారీగా రూ. 300కి పెరగాలి. ఇందుకోసం మనమందరం కలిసి పనిచేయాలని నేను భావిస్తున్నాను. నేను ఎవరినీ నిందించకూడదని అనుకుంటున్నాను. నా అంచనాలు నిజమవుతాయనే నమ్మకం ఉంది”అని గుప్తా వివరించారు. కస్టమర్లు ఎక్కువగా చెల్లించడానికి రెడీగా ఉన్నప్పటికీ,  టారిఫ్​లను పెంచలేకపోతున్నామని తెలిపారు వీటి పెంపుదల క్రమంగా, నిలకడగా ఉండాలని ఆయన అన్నారు.