అక్షర ప్రపంచం : ఉందిలే మంచి కాలం

అక్షర ప్రపంచం : ఉందిలే మంచి కాలం

రాతి గుండెలో నీళ్లు– ఈ కథల పుస్తకంలో ప్రతీ కథలోనూ అభ్యుదయం, ఆర్ద్రత కనిపిస్తాయి. ముఖ్యంగా ‘రాతిగుండెలో నీళ్ళు’ కథలో అతను రాసిన కథనం చూస్తే, ఎంత నిశితంగా సమాజాన్ని పరిశీలించాడో అనిపిస్తుంది.కఠినాత్మురాలిగా ముద్ర పడ్డ రంజని రాతి లాంటి గుండెలో నీళ్ళు ఎలా ఊరాయి? ఒక హిజ్రా అయిన రమణి మరణం ఆమెలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది? డ్వాక్రా మహిళలకు అందే సొమ్ములో వాటా దండుకునే ఆమె హిజ్రా దగ్గర ఎందుకు వాటా తీసుకోలేకపోయింది? రమణికి, రంజనికి సంబంధం ఏమిటి?

‘రాముడు -భీముడు’ కథలోని చెట్టు కొమ్మలు మనల్ని పలకరిస్తాయి. మనిషి జీవనంతో ప్రకృతి ఎంత మమైకం అయిపోయిందోనని మనల్ని మనం ఒకసారి తరిచి చూసుకుంటాము. మనిషి, మానసికంగా  ఎన్ని రూపాంతరాలు  దాల్చినా, మంచి వాడుగా ఉన్నా - లేకున్నా, ప్రేమించిన మొక్క మాత్రం అతణ్ణి అక్కున చేర్చుకుంటుందనిపిస్తుంది ఈ కథ చదివితే. రాముడి పాత్ర గొప్పగా తీర్చిదిద్దాడు. తన రచనా వైభవాన్ని పరిచయం చేశాడు. ‘వెలుగు సూరీడు’ కథ అభ్యుదయ భావాలతో ముందుకు సాగింది. మనిషికి మనిషి తోడు, మళ్ళీ ఎదిగిన మనిషి అదే సంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవడం... ఇలా ఎంతమంది చేస్తున్నారు అనుకుంటారా? కానీ కృష్ణ రాసిన ఈ కథ చదివితే, వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూసుకుని సరైన రీతిలో ఆలోచిస్తారు. సాయం చేసే అలవాటున్న మనిషి, రాబోయే ఫలితం కోసం ఆలోచించడు. కానీ, ఆ ఫలితం వస్తే అమితానందం పొందుతాడు. ఈ కథలో రాసిన  వాక్యాలు  గొప్పగా ఉన్నాయి. మచ్చుకి ఒకటి “జ్ఞానానికి, దీపానికి ప్రత్యేకమైన గుర్తింపు అవసరం లేదు” అన్న వాక్యం  వలన కథ మరింతగా ప్రభవించినది.  

‘స్వర్గసీమ’ కథ - సొంత ఇంటి బంధాన్ని తెంచుకోవడం అంత సులభం కాదన్న విషయం మీద చక్కగా అలతి పదాలతో రాశాడు. స్నేహితునిలో మార్పు తీసుకొచ్చిన వాట్సాప్ మెసేజ్​ చదివితే కన్నీళ్లు ఆగవు. ఆ మెసేజ్ కథకే హైలెట్. ‘దిష్టి’ కొత్త తరహా కథ. నాగరికత పెరిగిన జనం, మూఢనమ్మకాలను వీడడం లేదు. నాగరికత భౌతికంగానే తప్ప, మానసికంగా కనబడడం లేదు. తాను బాగుంటే చాలునన్న సంకుచిత మనస్తత్వం బాగా పెరిగిన ఒక కాలనీ జనంలో మార్పు కోసం తాపత్రయ పడే మనిషి కథ. ఇలాంటి వాటి మీద కూడా కథ రాసి మెప్పించవచ్చన్న రచయిత ఆలోచన
మెచ్చదగ్గది. ఈ కథ చదివాక చాలామంది భుజాలు తడుముకుంటారు.

‘మైత్రీవనం’ అన్న కథలో ఒక మనిషి, ఒక ఊరి సమస్యని ఎదుర్కోవడానికి గ్రూప్ ద్వారా అందర్నీ చైతన్య పరిచిన విధానం బాగుంది. ఇలా యువకులంతా ఆలోచిస్తే, ఈ దేశం ఎంతో పురోగమిస్తుంది త్వరితగతిన. అభ్యుదయం, ఆశావాదం అన్నీ కథల్లోనూ ప్రస్ఫుటంగా కనబడ్డాయి. ఈ కథలు చదివిన వాళ్లని ఆలోచింపచేస్తాయి. వివిధ ప్రముఖ పత్రికల్లో యాభైకి పైగా కథలు ప్రచురించబడినా అందులోని వైవిధ్యమైన పదహారు (16) కథలను ఒక సంపుటిగా తెచ్చి పాఠకుల హృదయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కథనం విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. భావోద్రేకం, ఆర్ద్రత కథల్లో సమపాళ్లలో ఉంటే ఇంకా బాగుంటుంది. 
వస్తువు ఏదైనా కథగా మలిచే నైపుణ్యం ఉంది. కానీ, మనసుల్ని వెంటాడే గొప్ప కథలు ఇప్పటికీ తక్కువగానే తారసపడుతున్నాయి. ఇప్పుడు మన సాహితీ ప్రపంచంలో కొద్దిమందే యువ రచయత(త్రు)లు ఉన్నారు. కృష్ణలాంటి యువ రచయతల సంఖ్య బాగా పెరగాలి. 
 
చాగంటి ప్రసాద్