Akshay Kumar : నా కుమార్తెకు 'నగ్న చిత్రాలు పంపమంటూ' మెసేజ్! -బాలీవుడ్ హీరో ఫ్యామిలీకి సైబర్ వేధింపులు

Akshay Kumar : నా కుమార్తెకు 'నగ్న చిత్రాలు పంపమంటూ' మెసేజ్! -బాలీవుడ్ హీరో ఫ్యామిలీకి సైబర్ వేధింపులు

రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా చాలు అందినకాడికి దోచేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సైబర్ ముప్పు తప్పడం లేదు.  ఈ రోజు ముంబైలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ అక్టోబర్ 2025' ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ కేటుగాళ్ల నుంచి తన కుటుంబానికి ఎదురైన అత్యంత భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు.  
 
ఆన్‌లైన్ గేమ్‌లో మొదలైన పాడుపని.. 

 సైబర్ నేరగాళ్లు ఎంత నైపుణ్యంతో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటారో అక్షయ్ కమార్ వివరించారు. కొన్ని నెలల క్రితం తన 13 ఏళ్ల కుమార్తె నితారా, ఒక ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు .. ఓ అపరిచిత వ్యక్తి ఆమెతో సంభాషణ ప్రారంభించాడు. మొదట్లో అవతలి వ్యక్తి 'థ్యాంక్యూ', 'వెల్‌ ప్లేయ్‌డ్', 'ఫెంటాస్టిక్' వంటి మర్యాదపూర్వక మెసేజ్‌లు పంపాడు. అతను చాలా మంచివాడిగా అనిపించాడు. కొంతసేపటికి, 'నువ్వు అబ్బాయివా లేక అమ్మాయివా?' అని అడిగాడు. నా కుమార్తె 'అమ్మాయిని' అని చెప్పగానే, అతని సంభాషణ తీరు పూర్తిగా మారిపోయింది అని అక్షయ్ కుమార్ సభలో వెల్లడించారు.

వెంటనే ఆ దుండగుడు తన కుమార్తెకు "నాకు నీ నగ్న చిత్రాలను పంపుతావా?" అని మెసేజ్ చేశాడు. ఈ మాట వినగానే నితారా షాకైంది. అయితే వెంటనే గేమ్ ఆపేసి, ఏమాత్రం సంకోచించకుండా తన తల్లి ట్వింకిల్ ఖన్నా కు జరిగిన విషయాన్ని చెప్పడం చాలా గొప్ప విషయం అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

ALSO READ : నాగ్ అశ్విన్ ప్రాజెక్టు నుంచి ఆలియా భట్ ఔట్!

తల్లిదండ్రులకు హెచ్చరిక!

ఈ సంఘటన కేవలం తన కుమార్తెకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి పిల్లాడికి, తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే హెచ్చరిక అని అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు.  నేరగాళ్లు (Predators) మొదట ఇలాగే మంచిమాటలతో నమ్మకం పెంచుకుని, ఆపై మైనర్లను లైంగికంగా దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది తరచుగా బ్లాక్‌మెయిలింగ్‌కు, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది అని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అందుకే, ఈ సైబర్ నేరాలను కేవలం చట్టం ద్వారా మాత్రమే అరికట్టడం కష్టమని, ప్రతి ఒక్కరూ  డిజిటల్ పై అవగాహనను పెంచుకోవాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.  సైబర్ నేరాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.  ఈ సందర్భంగా పాఠశాలల్లో చరిత్ర, భూగోళశాస్త్రం వంటి సబ్జెక్టులతో పాటు సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక తరగతులను తప్పనిసరి చేయాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను అక్షయ్ విజ్ఞప్తి చేశారు. సైబర్ ప్రపంచంలో '2+2=4' కాదు, అది 'సున్నా' అవుతుందని, అంటే చిన్న పొరపాటు కూడా జీవితాన్ని నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు.

 

ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కీలక నిర్ణయం

ఈ నెల రోజుల 'సైబర్ అవేర్‌నెస్ మంత్' ద్వారా పౌరులకు, ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు , పాఠశాలలకు ఆన్‌లైన్ భద్రత, డిజిటల్ బాధ్యత గురించి సమగ్రంగా అవగాహన కల్పించనున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన ప్రసంగంలో అక్షయ్ కుమార్ అనుభవాన్ని ప్రస్తావిస్తూ, డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ నివారణ చర్యలను బలోపేతం చేస్తామని, పాఠశాలల్లో సైబర్ విద్యను చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియాలో పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి సమాచారం పంచుకుంటున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.