ఆర్ఎస్ ప్రవీణ్​పై ఆకునూరి మురళి ఫైర్​

ఆర్ఎస్ ప్రవీణ్​పై ఆకునూరి మురళి ఫైర్​
  • అప్పుడు కేసీఆర్ దుర్మార్గుడు.. ఇప్పుడు హీరోనా?
  • మీ రాజకీయాలను చూశాక యువత ఎవరినీ నమ్మరంటూ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మండిపడ్డారు. గాడిద మీద ఎక్కి అయినా ఎంపీ అవ్వాల్సిందేనా అంటూ ఆర్ఎస్​పీని ప్రశ్నించిన ఆయన.. గాడిదలకు క్షమాపణ చెప్తున్నానంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్​తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందన్న వార్తల నేపథ్యంలో ప్రవీణ్​ తీరుపై మురళి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కావట్లేదంటూ ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. 

‘‘బీఆర్ఎస్ పార్టీపై రెండేండ్లు మీరు చెప్పినవన్నీ తప్పేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్.. ఇప్పుడు మీకు హీరో అయ్యారా? గాడిద మీద ఎక్కినా పర్లేదు.. మీరు ఎంపీ అవ్వాల్సిందేనా (గాడిదలకు క్షమాపణలు)? రేపటి నాడు కేంద్రంలో బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెల్వదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరూ అనుసరిస్తారా? అన్యాయం పోలీస్ బాస్​. మీ నిర్ణయం కరెక్ట్ కాదు. మిమ్మల్ని, మీ రాజకీయాలను చూశాక యువత ఇంకెవరినీ నమ్మరు’’ అని ఆకునూరి మురళి అన్నారు.