బీఆర్ఎస్​ను బొంద పెట్టాలి: ఆకునూరి మురళి

బీఆర్ఎస్​ను బొంద పెట్టాలి: ఆకునూరి మురళి
  •    సీఎం కేసీఆర్ ది అవినీతి, అబద్ధాల పాలన
  •     జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళి
  •     రూ.వేల కోట్లతో 36 లక్షల ఎకరాలకు డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే కుంగింది
  •     పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఫైర్

మిర్యాలగూడ/హుజూర్ నగర్/మఠంపల్లి/నేరెడుచర్ల, వెలుగు : బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని జాగో తెలంగాణ కన్వీనర్  ఆకునూరి మురళి పిలుపు నిచ్చారు. సీఎం కేసీఆర్ ది అవినీతి, అసమర్థ, అబద్ధాల, అరాచక పాలన అని ఆయన  మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. టీఎస్ డీఎఫ్, జాగో తెలంగాణ సంయుక్తంగా  చేపట్టిన ఓటర్ల చైతన్య బస్సుయాత్ర ఆదివారం మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా మఠంపల్లి, నేరేడుచర్ల పట్టణానికి చేరుకుంది. 

ఈ సందర్భంగా ఆయా ఊర్లలో  ఏర్పాటు చేసిన సమావేశాల్లో మురళి మాట్లాడారు. రూ.వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని ఫైర్  అయ్యారు. సుమారు 36  లక్షల ఎకరాలకు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన  అవినీతిని ప్రజలు గుర్తించాలన్నారు. బీఆర్ఎస్  పాలనలో విద్య, వైద్య రంగాల్లో విపరీతమైన విధ్వంసం జరిగిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో 74 శాతం ఫ్యాకల్టీ లేరని, ఉస్మానియా ఆస్పత్రి కూలిపోయే దశకు చేరుకొని డాక్టర్లు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ కు రాజకీయం తప్ప పరిపాలన చేతకాదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా పూర్తి చేయలేదన్నారు. 

రైతుబంధు పేరిట వ్యాపార, ధనిక వర్గాలకు రూ.వేల కోట్లను వారి ఖాతాలో జమ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, నియంతృత్వ,  దోపిడీ వ్యవస్థను పెంచి  పోషించేందుకు బీఆర్ఎస్,  బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని, ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఓటర్లను ఆయన కోరారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. 

మద్యం, డబ్బుతో ఓట్లు కొనాలని చూసే అభ్యర్థుల మాటలు నమ్మరాదన్నారు. ప్రజల ఆశలను వమ్ముచేసిన బీఆర్ఎస్  పార్టీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. బస్సు యాత్ర కార్యక్రమంలో  టీఎస్ డీఎఫ్  వేదిక సలహాదారు వినాయక్ రెడ్డి, జెవి చలపతిరావు, సమన్వయకర్తలు పద్మజ, జాగో నేత ఎం. హన్మేష్,  విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మూడోసారీ బీఆర్ఎస్ వస్తే నాశనమే

గరిడేపల్లి, వెలుగు : రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్  అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయమని జాగో తెలంగాణ కన్వీనర్  ఆకునూరి మురళి అన్నారు. ఆదివారం జాగో తెలంగాణ చేపట్టిన ఓటర్ల చైతన్య బస్సుయాత్ర సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చేరుకుంది.ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కొన్ని కుటుంబాల సంపద పెరిగింది తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకే మేధావులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్లతో సొంత ఖర్చులతో బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు.